వికేంద్రీకరణ మద్దతుగా న్యాయరాజధాని కావాలంటూ రాయలసీమ నేతలు కదం తొక్కారు. కర్నూలు వేదికగా చేపట్టిన రాయలసీమ గర్జనకు వైసీపీ లీడర్లు, విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు తరలి వచ్చారు. సభ విజయవంతమైందని... తమ ఆకాంక్షను చెప్పడంలో జేఏసీ విజయవంతమైందని నేతలు అభిప్రాయపడ్డారు. 


కర్నూలులో ఎస్టీబీసీ మైదానంలో జరిగిన సభలో చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా మంత్రులు, జేఏసీ, వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని... కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్‌ ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారన్నారు.   చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ అయితే... వైసీపీ దృష్టిలో ఇది రత్నాల సీమని తెలిపారు. రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ ఉందని... రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 


వికేంద్రకరణ కోసమే సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదని... స్వప్రయోజనాల కోసమే ఆరాట పడుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేనేలేదన్నారు మరో మంత్రి ఉషశ్రీ చరణ్‌. వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. 


చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ మూడు రాజధానులకు సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు జయరాం. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి సీఎం జగన్‌ తీసుకొచ్చారని తెలిపారు డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా. 


ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని... ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్సీ ఇక్బాల్. వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధానిని చేస్తామని జగన్ ప్రకటించారని తెలిపారు ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి. అలాంటి న్యాయరాజధాని కోసం ఎంతకైనా పోరాడతామన్నారాయన. రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉందన్నారు మరో వైసీపీ నేతల బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలన్నారు. 


రాయలసీమ గర్జన సందర్భంగా నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాసుర భూతం పేరుతో నినాదాలు రాశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.