ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరోమాట చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసగించిందని తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్టు వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి వైఎస్ చేసిన చేసిన ఐదు ప్రధానమైన వాగ్దానాలను తులసిరెడ్డి గుర్తుచేశారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, సకాలంలో పిఆర్సి అమలు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించడం.. లాంటి 5 ముఖ్యమైన వాగ్దానాలను గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక ఈ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే వైఎస్ జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇతర ఉద్యోగుల తరహాలోనే  పనికి సమాన వేతనం కల్పించకపోవడమే కాకుండా ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 50వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించడం దారుణం అన్నారు. ఇంకా రెండు లక్షల 50వేల మందిని తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 


అసలు వివాదం ఏంటంటే.. 
రాష్ట్ర విభజన అనంతరం  2014-19 మధ్యలో 90 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా రిక్రూట్‌ అయ్యారని, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్‌ మెంట్‌ కోసం ఏకంగా 'ఆప్కాస్‌' అనే వ్యవస్థ తీసుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్ర కేంద్రంతోపాటు జిల్లాలో కూడా నియామకాలు చేసిందని, వీరందరు తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయని ఆశిస్తూ ఉండగా వేల మందిని వైఎస్ జగన్ సర్కార్ వారిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు వీరికి శరాఘాతంగా మారాయని, రూ.16 వేల నుంచి రూ.23 వేలలోపు స్వల్ప జీతాలు ఇస్తున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను గుదిబండగా భావిస్తోందని ప్రభుత్వంపై బీజేపీ నేత మాధవ్ విమర్శలు చేశారు.


అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం, సమానపనికి సమాన వేతనం, ఇచ్చి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం' అని ప్రతిపక్ష నాయకునిగా జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, నేడు అందుకు భిన్నంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మాధవ్‌. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తుండటం తగదన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకుని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రిని  బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.