కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆమెకు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ అక్కడికి వెళ్లారు. సోమవారం (మే 22) మధ్యాహ్నం తర్వాత విశ్వ భారతి ఆసుపత్రికి వైఎస్ విజయమ్మ చేరుకొని అవినాష్ రెడ్డిని కూడా పలకరించారు. అనంతరం అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.


విషమంగానే అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం - ఆస్పత్రి


అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనగానే ఉందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. నాలుగు రోజులుగా అదే ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన ఇబ్బందులకు గాను ఆమెకు చికిత్స చేస్తున్నారు. అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా, తల్లితో ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. 


ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. ‘‘అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె నాన్‌ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌ (హార్ట్ అటాక్)కు గురయ్యారు. యాంజియోగ్రామ్ చేశాక.. ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం సీసీయూలో ఉన్న ఆమెను ఒక స్పెషల్ డాక్టర్ల టీమ్ పర్యవేక్షిస్తోంది. బీపీ తక్కువగా ఉంది. ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌పై ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు వాంతులు అవుతున్నాయి. వాంతులు ఇలాగే కొనసాగితే ఆల్ట్రాసౌండ్ స్కాన్‌, మెదడుకు ఇమేజింగ్ స్కాన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఆమెకు లోబీపీ ఉన్నందున మరికొన్ని రోజులు సీసీయూలో ఉంచాల్సి రావచ్చు’’ అని విశ్వశాంతి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.


అవినాష్ అరెస్టుకు యత్నిస్తున్న సీబీఐ
కర్నూలులో ఉదయం నుంచే హైడ్రామా నడుస్తోంది. ఉదయాన్నే కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్టు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దానికి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 


అయితే, అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్నందున 27వ తేదీ వరకు విచారణకు గడువు ఇవ్వాలని కోరారు. 27 నుంచి తాను విచారణకు అందుబాటులోకి వస్తానని పేర్కొన్నారు. తన లేఖతోపాటు తల్లి ఆరోగ్యంపై వైద్యుల ఇచ్చిన రిపోర్టులను కూడా జతపరిచారు. ఉదయం కూడా ఆయన ఓ లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ ఏడు రోజుల గడువు కోరారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని జత చేస్తూ మరో లేఖ రాశారు. 


కర్నూలులో హైటెన్షన్


ఈ పరిణామాల నేపథ్యంలో కర్నూలులో ఉదయం నుంచే హైడ్రామా నడుస్తోంది. పొద్దునే కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్టు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దానికి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ ఎదుట బైఠాయించారు. హాస్పిటల్ ముందే పెద్ద ఎత్తున బైఠాయించి బయటవారు రాకుండా అడ్డుకుంటున్నారు.