Woman Found Diamond: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న తుగ్గలి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన మహిళకు పొలం పనులు చేస్తుండగా అత్యంత విలువైన వజ్రం లభ్యమయింది. దీంతో విషయం తెలుసుకున్న గుత్తికి చెందిన ఓ వ్యాపారస్తుడు ఈ వజ్రాన్ని సుమారు 35 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో కోటి రూపాయలు ఉంటుందని గ్రామస్తులు చర్చిస్తున్నారు. ఈ వర్షాకాల సీజన్లో ఇంత ఖరీదైన వజ్రం లభ్యం కావడం ఇదే మొదటిది అని అంటున్నారు. 


మహిళా రైతుకు వరించిన వజ్రం


వాళ్లంతా రైతులు రోజూలాగే వ్యవసాయ పనుల కోసం ఉదయమే ఇంట్లో నుంచి బయల్దేరి పనుల్లో నిమగ్నమయ్యారు. టమోటా తోటలో పని చేస్తుండగా ఓ మహిళకు ఓ రాయి దొరికింది. చూడటానికి చక్కగా, అందంగా ఉంది. తన భర్తకు చూపించింది. ఇది వజ్రమేమో అనుకున్నారు. వజ్రాల వ్యాపారులకు సందేశం పంపించగా.. వారు అక్కడికి వచ్చి దానిని పరిశీలించారు. అది వజ్రమేనని తేల్చారు. సుమారు రూ. 30 లక్షలు ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆ వజ్రం ధర బహిరంగ మార్కెట్లో కోటి వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. 


చినుకు పడితే చాలు సందడి సందడే


జొన్నగిరి, ఎర్రగుడి, గిరిగెట్ల, తుగ్గాలి, రత్నా, వంటి ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు వజ్రాల వేట సాగిస్తారు. వర్షాకాలం వస్తే చాలు వేలాది మంది అక్కడ వజ్రాలు వెతుకుతూ కనిపిస్తారు. ఇక్కడికి జిల్లా వాసులే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండీ వజ్రాల వేటగాళ్లు వస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో పడుతున్న వర్షాలకు వజ్రాల వేటగాళ్లు అక్కడ అనునిత్యం వాటికోసం వెతుకుతూ ఉన్నారు. కొందరికి అదృష్టవశాత్తు వజ్రాలు దొరుకుతుంటాయి. వజ్రాలు దొరికినట్లు సమాచారం అందగానే దగ్గర్లోనే వజ్రాల వ్యాపారులు రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతారు. వాటి రంగు, కోణం, నాణ్యత మిగతావన్నీ చూశాక బేరసారాలకు దిగుతారు. మంచి వజ్రం అయితే లక్షలు, కోట్లలో పెట్టడానికి వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. 


వజ్రాలు ఎలా దొరుకుతాయి


రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాను కేంద్రంగా చేసుకొని పాలెగాళ్లు పరిపాలించారు. అలా బ్రిటీష్ వాళ్లు అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారని, ఆ క్రమంలో పోయిన వజ్రాలే ఇప్పుడు దొరుకుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. వర్షాలు పడినప్పుడు భూమి పైపొర నీటికి కొట్టుకుపోతే వజ్రాలు బయటపడతాయని స్థానికులు వస్తారని చెబుతున్నారు. 


గత కొన్ని సంవత్సరాల క్రితమే అన్ని రకాల పరీక్షలు...!


అయితే ఇక్కడి వజ్రాల వేట ప్రభుత్వాలకు తెలియనిది కాదు. ఈ వజ్రాల గురించి అప్పట్లో ప్రభుత్వాలు పలు పరిశోధనలు నిర్వహించాయి. అయితే ఇక్కడ వజ్రాలు దొరికే పరిస్థితి అంతగా లేకపోవడం, మిగతా ఖర్చులు పోనూ నష్టాలే వచ్చే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వమే తవ్వి వజ్రాలు వెలికితీసేందుకు మొగ్గు చూపలేదు. అలాగే ఇక్కడ దొరికే వజ్రాలు నాణ్యమైనవి కావని పరిశోధకులు తేల్చారు. అందువల్ల ఈ ప్రాంతాల్లో ప్రభుత్వాలు వజ్రాలు తవ్వకాలు జరపడం లేదని స్థానికులు చెబుతున్నారు.