వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాష్ట్ర రాజధాని అంశమే ప్రధానంగా ఉంటుందని నిన్నటి వరకు అందరూ భావించారు. కానీ ఇప్పుడు మరో అంశం కూడా మళ్లీ తెరమీదకు రాబోతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ రాజధానినే నమ్ముకుంటే జాతీయపార్టీ కాంగ్రెస్‌ మాత్రం రెండు అంశాలపై ప్రజల్లోకి రావాలనుకుంటోంది. ఈ దెబ్బతో ఇటు రాష్ట్రం అటు కేంద్రంలో పాగా వేయాలని చూస్తోంది. మరి ఈ జోడో ప్లాన్‌ ఎంతవరకు వర్క్‌ అవుతుంది ?ఇప్పుడిదే లేటెస్ట్‌ హాట్‌ టాపిక్‌.


కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ జోడో యాత్ర ఆ పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చుతుందో తెలియదు కానీ పార్టీ శ్రేణుల్లో మాత్రం కాస్తంత జోష్‌నైతే నింపుతోంది. ముఖ్యంగా ఏపీలో అడ్రస్‌ లేకుండా పోయిన పార్టీకి మళ్లీ జీవం పోసినట్లైంది. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర ఇటు తెలంగాణ అటు ఏపీని రెండింటిని కలుపుతూ సాగుతోంది. కర్నూలుజిల్లాలో సాగుతోన్న జోడో యాత్ర సందర్భంగా ఆపార్టీ సీనియర్‌ నేత జైరాంరమేష్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేక హోదా గురించి మళ్లీ ఆయన మాట్లాడటంతో కాంగ్రెస్‌ ఎలాంటి వ్యూహంతో వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లబోతోంది అన్నదానిపై క్లారిటీ వచ్చేసిందంటున్నారు రాజకీయవిశ్లేషకులు.


ప్రస్తుతం ఏపీలో రాజధాని అంశం కాకరేపుతోంది. ప్రాంతీయ పార్టీలు టిడిపి, జనసేనతోపాటు జాతీయపార్టీ బీజేపీ కూడా ఈ అంశాన్నే ఆసరాగా చేసుకొని అధికారంలోకి రావాలని భావిస్తున్నాయి. అందుకే మూడు పార్టీలు ఏకమై అధికారపార్టీతో వచ్చే ఎన్నికల్లో పోరుకి సిద్ధమవుతున్నాయి. ఈ  తరుణంలో జైరాం రమేష్‌ వ్యాఖ్యలతో మళ్లీ హస్తం ప్రత్యేకహోదాని తెర మీదకు తెస్తోంది. బీజేపీని ఇటు తెలంగాణ అటు ఏపీ రెండింటిలోనూ దెబ్బతీయాలంటే ఆపార్టీ తెలుగు ప్రజలకు చేసిన మోసాల గురించి చెప్పాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జైరాం రమేష్‌ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతోపాటు వెంకయ్యనాయుడు కూడా ఏపీ ప్రజలను నిండా ముంచేశారని గుర్తు చేశారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ ఇప్పటికీ కట్టుబడే ఉందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. 


మా దారి సపరేట్: కాంగ్రెస్ 


ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అందరిది ఒక దారి అయితే కాంగ్రెస్ పార్టీది మరోదారి అన్నట్లుగా తయారైంది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారా? అది గత ఎన్నికల్లోనే ప్రచార అస్త్రంగా ఉపయోగపడింది. దాన్ని ఏ మేరకు క్యాష్ చేసుకోవాలో అంత చేసుకోని అధికారంలోకి వచ్చింది వైసీపి. అటు టీడీపీ కూడా రెండు నాలుకల ధోరణి అవలంభించి చాలా నష్టపోయిందని అనుకుంటున్నారు. ఇక బీజేపీ అయితే ప్రత్యేకహోదా అంశమే ఎత్తడంలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదాపై అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, వామపక్షాలు కూడా మాట్లాడంలేదు. అరిగిపోయిన రికార్గుల తయారైంది ప్రత్యేక హోదా అంశం అని ఏపీ ప్రజలు అనుకుంటున్న తరుణంలో జైరాం రమేష్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. రాజధాని మీద అంతా హడావుడి జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని జనసేన, టీడీపీ చేతులు కలుపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి అందర్ని విస్మయానికి గురిచేస్తోంది. 


తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో జోడో యాత్రలో తెలంగాణ ప్రజలకు రాహుల్‌ గాంధీ స్పష్టంగా వివరణ ఇస్తారని కూడా ఆయన చెప్పడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. రేవంత్‌ రెడ్డితో ఉన్న అభిప్రాయాల భేదాల కారణంగా చాలామంది సీనియర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ పెద్దలు ఎంతగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో తెలంగాణలో సాగనున్న జోడోయాత్రలో పార్టీలోని అంతర్గత కలహాలకు ఫుల్‌ స్టాఫ్‌ పడబోతోందన్న టాక్‌ వినిపిస్తోంది.


కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే తెలుగు రాష్ట్రాలు కీలకమని ఆపార్టీ సీనియర్‌ నేత జైయరాం రమేష్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు ఏపీలో ప్రత్యేకహోదా, రాజధాని అంశాలను రెండింటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారాన్ని అందుకోవాలని తహతహలాడుతోంది. తెలంగాణ కూడా కాంగ్రెస్‌ వల్లే వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తూనే అధికార టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ వల్ల జరిగే నష్టాలను వివరంగా ప్రజల ముందుంచి తెలంగాణని హస్తం గతం చేసుకోవాలనుకుంటోంది.