Uranium Digging at Kappatralla in Kurnool District | కర్నూలు: విదేశాల్లో పండే పంటల్ని భూమి అనువుగా లేకున్నా టెక్నిక్ ద్వారా పండించి అద్భుతాలు చేస్తున్నాం. చిన్న గడ్డి మొలవని చోట సైతం పండ్లు, కాయలు పండిస్తున్నాం. కానీ ఓ రసాయన మూలకం కొన్ని గ్రామాలకు శాపంగా మారబోతోంది. ఇటీవల తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని దామగుండం అడవిలో భారత నౌకాదళం (Indian Navy) కి సంబంధించిన రాడార్ స్టేషన్‌కు అక్టోబర్ 15న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కొన్ని రోజులముందు హైదరాబాద్ లో, అటు వికారాబాద్ దామగుండం ఫారెస్ట్ ఏరియాలోనూ ప్రజలు ఆందోళనకు దిగారు. నిరసన చేపట్టి రాడార్ స్టేషన్ వద్దని మొత్తుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి గోడు పట్టించుకోలేదు. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో మూసీ నదికి ముప్పు ఉందని, భవిష్యత్తులో పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆరోపించినా ప్రయోజనం లేకపోయింది.


తాజాగా ఇలాంటి సంఘటనే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల దాని చుట్టుపక్కల పది గ్రామాల వారిని ఏకం చేసింది. కప్పట్రాళ్ల రక్షిత అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో స్థానికులు భగ్గుమంటున్నారు. యురేనియం తవ్వకాలతో తమ జీవితాలను నాశనం చేయకూడదంటూ ఆందోళన చేపట్టారు. యురేనియం తవ్వకాలను చేపట్టవద్దని దేవనకొండ మండలం కప్పట్రాళ్లను గ్రామస్తులు స్వీయ నిర్బంధం చేసుకున్నారు. కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు వద్దంటూ చుట్టుపక్కల గ్రామాల వారు ఏకమై ఆందోళన చేస్తున్నారు. గ్రామంలోకి ఎవరినీ రానివ్వకుండా రాళ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. మరోవైపు మార్గంలో రోడ్డుపై వందలాది మంది బైఠాయించి యురేనియం తవ్వకాలపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. 



యురేనియం తవ్వకాలపై కప్పట్రాళ్ల గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించడంతో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల స్టేజి వద్ద శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బళ్లారి- కర్నూలు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యురేనియం వద్దు, పర్యావరణ పరిరక్షణ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కప్పట్రాళ్ల అటవీప్రాంతం సమీప గ్రామాలవారు నిరసనకు దిగి సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. నవంబర్ 4న కలెక్టర్ వచ్చి చర్చిస్తానని హామీ ఇవ్వడంతో ఆ గ్రామాల ప్రజలు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.



ప్రజలకు మద్దతుగా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. కప్పట్రాళ్లలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వస్తుండగా పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా, అడ్డుకున్నా ఎమ్మెల్యే విరుపాక్షి కపట్రాల్లకు చేరుకున్నారు. యురేనియం తవ్వకాలు నిలిపివేసే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే నిరసనకు ఉద్యమరూపం ఇస్తామని హెచ్చరించారు. ప్రమాదకర యురేనియం మూలకం వెలికితీయడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని, సమీప ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. 


ప్రభుత్వ అనుమతితో అలజడి..
యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (UCIL) కప్పట్రాళ్ల రక్షిత అడవుల్లో 468.25 హెక్టార్లలో 68 బోర్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. కప్పట్రాళ్ల, బేతపల్లి, పి.కోటకొండ, చెల్లెలచెలిమల, గుండ్లకొండ, నెల్లిబండ, మాదాపురం, నేలతలమరి, జిల్లేడు బుడకల, దుప్పనగుర్తి, ఈదులదేవరబండ, బంటుపల్లి గ్రామాల పరిధిలో రక్షిత అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు శుక్రవారం నాడు కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో చేయనిచ్చేది లేదని తీర్మానించారు.