శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీ లీడర్లపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన కామెంట్స్ జిల్లా వ్యాప్తంగా సంచలనమయ్యాయి. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్న టైంలో వారిపై గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. 


తన వెంట్రుక కూడా పీకలేరంటూ వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇద్దామని బీజేపీ లీడర్లు ప్రెస్‌క్లబ్‌ వద్దకు వచ్చారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరించారు. 


జనసేన, బీజేపీ నాయకులపై కేతిరెడ్డి చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు యత్నించిన బీజేపీ లీడర్లపై దాడి జరిగింది. ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నాయకులు ఆరుగురిని గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో చితకబాదారు. తీవ్రంగా గాయపరిచారు. ఆరుగురు తీవ్ర రక్తస్రావం జరగడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం నియోజకవర్గం ప్లీనరీ సమావేశాన్ని ధర్మవరంలో నిర్వహించారు. ప్లీనరీకి ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి భారీ బైక్ ర్యాలీతో వచ్చారు. అనంతరం ఆయన విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రారా తేల్చుకుందాం అంటూ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు వరదాపురం సూరీని ఉద్దేశించి సవాల్ విసిరారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే వైసిపి కార్యకర్తలను కాళ్లు చేతులు విరుస్తాను అని ప్రగల్బాలు పలికిన ఇతను ఎన్నికల అనంతరం ఓటమి అవమానంతో అసోం పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆది సినిమా తరహాలో అంతా అసోం రైలు ఎక్కేసారని విమర్శించారు. కేవలం ఓటమి చెందినంత మాత్రాన ఓట్లేసిన ప్రజలను వదిలిపెట్టి అసోం పారిపోవడం నాయకత్వం లక్షణం కాదన్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజాసమస్యలు తీర్చడం చేతకాదు అని తీవ్రంగా విమర్శించారు. 


తమ కేడర్‌ను అదుపులో పెట్టినందునే.. ధర్మవరంలో బీజేపీకి లీడర్ లేకపోయినా శ్రేణులు ప్రశాంతంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. లేకపోతే పొలిమేరలు దాటేవారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారం పక్కన పెడతా రండ్రా తేల్చుకుందాం అంటూ సవాలు విసిరారు. ఏది కబ్జానో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో సూరీడు అనుచరులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.