శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై రక్తం చిందేలా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వారు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ధర్మవరంలోని ప్రెస్‌క్లబ్‌ ఆవరణలోనే ఈ ఉద్రిక్తత జరిగింది. తొలుత ఓ ప్రెస్ మీట్ పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రెస్ క్లబ్ కు రాగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో బీజేపీ వర్గానికి చెందిన నేతలపై ప్రత్యర్థులు కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారికి తలపై బాగా గాయాలై చొక్కాల నిండా రక్తం కారింది. బీజేపీ నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారిపై దాడి జరిగిపోయింది. 


ఆ తర్వాత మూడు వాహనాల్లో వచ్చిన దుండగులు దాడి అనంతరం అవే వాహనాల్లో పరారీ అయ్యారు. ధర్మవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజు, ఆ పార్టీ కార్యదర్శి రాముతో పాటు మరికొందరికి తలపై బలమైన గాయాలు అయ్యాయి. వారిని బీజేపీ కార్యకర్తలు వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.


ధర్మవరం ప్రెస్‌ క్లబ్‌లో తాము మీడియా సమావేశానికి వెళ్తుండగా వైఎస్ఆర్ సీపీ నేతలు తమపై ఈ దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు కూడా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులేనని ఆరోపించారు. నిన్న (జూన్ 27) ధర్మవరం నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, అందుకు తాము కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీటర్ నిర్వహించేందుకు వెళ్తుండగా ఇలా దాడి చేశారని విమర్శించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడికి పాల్పడ్డవారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణం దాటి వెళ్లకుండా చెక్‌ పోస్టులను అలర్ట్‌ చేశారు.


గుడ్డలూడదీసి కొడతారంటూ బీజేపీ నేతపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
ధర్మవరంలో జూన్ 27న జరిగిన ప్లీనరీ సమావేశంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి కేతిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణతో పాటు, ఆయన వర్గీయులు గత కొద్ది రోజులుగా కేతిరెడ్డిపై అనేక విమర్శలు చేస్తున్న వేళ కేతిరెడ్డి గట్టిగానే హెచ్చరికలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఉద్దేశించి విమర్శలు చేశారు.


‘‘ఇప్పుడు బీజేపీలో ఉన్నావు. టీడీపీలోకి వెళ్తానని ప్రచారం చేసుకుంటున్నావు. టీడీపీలోకి వస్తే ధర్మవరం నడిబొడ్డున కళాజ్యోతి సెంటర్ లో గుడ్డలుడదీసి కొడతా అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు గెలిచినా ఓడినా అంతా అస్సాం రైలెక్కి కనిపించకుండా పోతారు. నేను ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలోనే ఉంటా” వాళ్లు గెలిస్తే ఆరు నెలల్లో నా కాళ్లు చేతులు విరిచేస్తానని చెప్పారు. నన్ను కొట్టి చూడు. పొలిమేర కూడా దాటలేరు” అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.