Nara Lokesh: బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి రాజారెడ్డి రాజ్యాంగం తల వంచిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అరాచక స్వామ్యంలో అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిందని నారా లోకేష్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో టీడీపీ మద్దతు దారు విజయం జనం విజయమని సీఎం వైఎస్ జగన్ ఓటమి అని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారని గుర్తుచేశారు. 'భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నా.. పులివెందుల పూల అంగళ్ల వద్ద నీ గెలుపు నినాదం మారుమోగింది' అని అన్నారు. ఇక మిగిలింది.. వై నాట్ పులివెందుల అని అన్నారు. తిరుగు లేని తీర్పు ఇచ్చిన పట్టభద్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని అన్నారు. నిండు సభలో తన తల్లిని అవమానించారని, ఆ వైసీపీ నేతలను ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. త్వరలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు లోకేష్.
సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రెండో రోజు సాగింది. నల్ల చెరువు మండలం చిన్నపాల్లోళ్ల పల్లి నుండి యువగళం పాదయాత్ర 47వ రోజు కొనసాగింది. పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులతో కలిసి యువగళం పాదయాత్రను ప్రారంభించారు. సంజీవుపల్లి వద్ద స్థానిక వ్యక్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద ఎల్లంపల్లి వద్ద మహిళలు, చిన్నారులతో నారా లోకేష్ ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానికులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. లోకేష్ కు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.
యువగళం పాదయాత్ర చిన్నపాల్లోళ్ల పల్లి నుండి నల్లచెరువు వరకు చేరుకోగానే.. చేనేత కార్మికులు నారా లోకేష్ ను కలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నారా లోకేష్ కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. నల్ల చెరువు వద్ద యువగళం పాదయాత్ర పెద్ద సంఖ్యలో జనాలతో జనసందోహంలా కనిపించింది. ఆ తర్వాత గాజే ఖాన్ పల్లి వద్ద స్థానికులతో నారా లోకేష్ మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 42వ జాతీయ రహదారి మీదుగా సాగిన పాదయాత్రలో భాగంగా ప్యాయలవారిపల్లిలో భోజన విరామం తీసుకున్నారు.
వచ్చేది మన ప్రభుత్వమే, రైతులకు మద్దతుగా నిర్ణయాలు
శనివారం తనకల్లు మండలంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. చీకటి మానిపల్లి వద్ద పాదయాత్ర ప్రారంభం అయింది. గంగసాని పల్లి వద్దకు రాగానే నారా లోకేష్ తో టమోటా రైతులు కలిసి మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, ఇతర సమస్యలతో సతమతం అవుతున్నట్లు రైతులు తమ ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు. టమోటా పంటకు గిట్టుబాటు ధర రావడానికి ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రైతులు నారా లోకేష్ ను కోరారు. ఈ మేరకు రైతుల డిమాండ్ పై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. సర్కారు చేతిలోకి రాగానే రైతులకు మద్దతుగా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత యువగళం పాదయాత్ర బిసనవారిపల్లి వద్దకు చేరుకుంది. ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు లోకేష్ ను కలుసుకుని మాట్లాడారు.