Andhra Pradesh News | రాయచోటి: తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. టిడిపి మాజీ ఎమ్మెల్యే సుదవాసి పాలకొండ్రాయుడు 78 కన్నుమూశారు. పలుమార్లు రాయచోటి ఎమ్మెల్యేగా, ఓసారి రాజంపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1946 జూలై 3న జన్మించిన పాలకొండ్రాయుడు జనతా పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండిపెండెంట్ గానూ ఎన్నికల్లో నెగ్గి విజయవంతమైన నేతగా నిలిచారు.
వయసు రీత్యా గత కొంతకాలం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీడీపీ సహా కూటమి నేతలు, రాయచోటి నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన దాదాపు మూడు దశాబ్దాల పాటు రాయచోటిలో కీలక నేతగా సేవలు అందించారు. వరుస ఎన్నికల్లో విజయాలు సాధించిన టీడీపీ నేతల్లో ఆయన ఒకరు.
పాలకొండ్రాయుడు పొలిటికల్ కెరీర్..అప్పట్లో ఎంతో క్రేజ్ ఉన్న జనతా పార్టీ ద్వారా పాలకొండ్రాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో ప్రస్తుత అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తొలిసారి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీని వీడిన ఆయన 1983లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రాయచోటి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత ఏడాదికి ఎన్నికలు రావడం.. మరోవైపు ఆయన టీడీపీలో చేరారు. 1984 ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రాయచోటి ఎమ్మెల్యేగా విజయాలు అందుకున్నారు.
పాలకొండ్రాయుడుకు భార్య, ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు సుదవాసి ప్రసాద్ బాబు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే చాలా కాలం నుంచే పాలకొండ్రాయుడు యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు.