TDP Chief Chandrababu About pensions not distributing at home- గూడూరు/కోడుమూరు: పెన్షన్ పంపిణీలో ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నప్పటికీ వైసీసీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ వ్యాప్తంగా 1.26 లక్షల సచివాలయం సిబ్బంది, 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు సిబ్బంది, 5 వేల మంది వ్యవసాయ సిబ్బంది, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. వీరితో పెన్షన్ పంపిణీ చేయిస్తే ఒక్కొక్కరు 45 మందికి మాత్రమే పెన్షన్ ఒక్కరోజులో ఇవ్వొచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. 


సీఎం జగన్ బాధ్యతలు విస్మరించి, శవ రాజకీయాలా? 
కర్నూలు జిల్లా గూడూరులో చంద్రబాబు క్యాంప్ సైట్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం వైఎస్ జగన్ తన బాధ్యతలను విస్మరించారు. జవాబుదారీ తనానికి బదులుగా ఎం శవరాజకీయాలు చేస్తున్నాడు. ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉన్నా, స్వార్థ ప్రయోజనాల కోసం అలా కుదరదని చెప్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పింది. పెన్షన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.


ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు ఇవ్వాల్సి ఉన్నా, డబ్బుల్లేక 3వ తేదీన పెన్షన్ ఇవ్వాలని మార్చి 28న సర్క్యలేషన్ విడుదల చేశారు. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని మార్చి 29న ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. డబ్బులు లేక పెన్షన్లు వాలంటీర్లతో పంపిణీ చేయలేదు, అదే సమయంలో వైసీపీ నేతలు వృద్ధులను ఎండలో పదేపదే సచివాలయాల చుట్టూ తిప్పించారు. ఈ కుట్రల కారణంగా 33 మందిని చనిపోయారు. ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే. వారు ఆత్మహత్య చేసుకోలేదు’ అని వివరించారు.


జగన్ కుట్రలో అధికారులు భాగమయ్యారు
ఏప్రిల్ నెలకు సంబంధించి వైసీపీ చేసిన కుట్ర, కుతంత్రం వల్ల 33 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల రోజుల కిందటి కుట్రలను జగన్ మోచేతి నీళ్లు తాగే అధికారులు అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్ (EC) కింద పని చేయాలి. సీఎస్, గవర్నర్, ఎన్నికల కమిషన్ ను కలిసి పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. సచివాలయాల్లో ఇవ్వకుండా నేరుగా ఇంటి వద్దే ఇవ్వొచ్చు. ఈసీ మాట పెడచెవిన పెట్టి.. పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు.


బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లకు మాత్రమే ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 65,49,000 మంది లబ్ధిదారుల్లో 45.92 లక్షల మంది అకౌంట్లు దొరికాయని చెబుతున్నారు. ఏప్రిల్ నెల సమయంలో లేని బ్యాంక్ అకౌంట్లు...ఇప్పుడు ఎలా వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. 25 శాతం మందికి అకౌంట్లు లేవని ప్రభుత్వానికి ఇప్పుడెలా తెలిసిందని,భోగస్ రిపోర్టులతో కాలయాపన కాకుండా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు సూచించారు. 


బ్యాంకు అకౌంట్లో పింఛన్ డబ్బులు వేస్తే.. వాళ్లు ఎండలో బ్యాంకులు, ఏటీఎంలకు క్యూ కట్టి ప్రాణాలు పోతే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఓటర్ స్లిప్పులు ఇచ్చేందుకు 41,230 మంది బీఎల్వోలుగా పని చేస్తున్నారని.. వీరితో పెన్షన్లు పంపిణీ చేస్తే ప్రక్రియ ఈజీగా పూర్తవుతుందన్నారు. ఎన్నికల నాటికి స్లిప్పులు కూడా  ఇవ్వవచ్చని సూచించారు.