Jc Prabhakar Reddy Warning To MLA Peddareddy : తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి(MLA Peddareddy), మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Jc Prabhakar Reddy)మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తాడిపత్రి (Tadipatri) ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో తాడిపత్రి రాజకీయాలు ఎన్నికలకు ముందే సెగలు పుట్టిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేత, తన ఇంట్లో ఊడిగం చేయించుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత ఫ్యాక్షన్ ప్రారంభిస్తానన్న పెద్దారెడ్డి వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పోలీసులు వెంట ఉంటే తప్ప బయట తిరగలేని వాడివి...తూ నీ బతుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తానంటే తనకు చాలా భయంగా ఉందంటూ సెటైర్లు వేశారు.
పెద్దారెడ్డితోనే జెండాలు కట్టిస్తా
అధికారంలోకి వచ్చిన తర్వాత నీతోనే జెండాలు కట్టిస్తాను, నీతోనే జెండాలు తీయిస్తానంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురం ఆర్డీవో వెంకటేశ్వర్లు, తాడిపత్రి మున్సిపల్ కమిషనర్, కొందరు పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సర వేడుకలకు తాడిపత్రి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అడ్డుగా ఉన్న వైసీపీ జెండాలను తొలగించాలని చెప్పామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జెండా వ్యవహారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లిందని ఆర్డీవో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వసూళ్ల కోసమే ఆర్డీవో వెంకటేశ్వర్లు తాడిపత్రికి వచ్చారని, జెండాల సమస్యను పరిష్కరించేందుకు రాలేదన్నారు. అనంతపురం ఆర్డీవో ఓ యూజ్ లెస్ ఫెలో అని మండిపడ్డారు. కొందరు పోలీసులు దిగజారారన్న జేసీ, ఎమ్మెల్యే కోసం ఏ పని చేయడానికైనా సిద్దంగా ఉన్నారని విమర్శించారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ...తాడిపత్రిలో కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 416/2023U/s341,188r/w 34 IPC సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమన్నారంటే...
పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తాడిపత్రిలో ఇసుకను దోచుకున్నారని, భూములు కబ్జా చేశారని, భారీగా అవినీతికి పాల్పడ్డారని కొందరు కరపత్రాలుపంపిణీ చేశారు. దీనిపై స్పందించిన తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు పెడతానంటూ ప్రత్యర్థులను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డి చూస్తారంటూ జెసీ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి పాల్పడుతున్నట్లు కరపత్రాలు పంచుతున్నారని, భవిష్యత్ లో ఇలాంటివి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొంత మంది వ్యక్తులే తమ టార్గెట్ అని, ఎన్నికలయ్యాక వారి కథ చెబుతామని పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ ప్రత్యర్థులను మాత్రం వదిలి పెట్టేది లేదన్న పెద్దారెడ్డి, రెండు మూడు నెలల్లోనే అసలు సినిమా చూపిస్తామన్నారు. అయితే సామాన్య ప్రజలు తమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. మరో మూడు నెలల్లో 1985 నుంచి 2004 వరకు ఎలా ఉన్నానో...దాన్ని మళ్లీ చూపిస్తానని హెచ్చరించారు.