SP SIdhharth Koushal: కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదోని పట్టణ వీధుల్లో బుల్లెట్ బండెక్కి తిరిగారు. గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపును, శోభయాత్రను బుల్లెట్ వాహనంపై తిరుగుతూ పరిశీలించారు. ఆదివారం పట్టణం అంతా కలియ తిరిగి మరీ స్థానిక పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో సిద్దార్థ్ కౌశల్ తో పాటు ఆదోని డీఎశ్పీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఆదోని పట్టణంలోని పోలీసు గెస్ట్ హౌస్ నుంచి బైక్ పై బయలుదేరి మండిగేరి, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, శ్రీనివాస్ భవన్ మీదుగా ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఆదోని సూపర్ బజార్, మార్కెట్, ఎమ్ ఎమ్ రోడ్డు, షరాఫ్ బజార్, బుడేకల్, హావన్నపేట, కౌడల్ పేట, తిక్కస్వామి దర్గా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి బైపాస్ మీదుగా తిరుగుతూ వినాయక ఊరేగింపు, శోభాయాత్రను పరిశీలించారు. 


ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. 
పలు చోట్ల తిరుగుతూ పోలీసులు అధికారులకు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పలు సూచనలు చేశారు. ఆదోని పట్టణంలో నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం, ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆ తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయారు. 


నెల్లూరు వినాయక విగ్రహాల వద్ద గొడవలు.. 
మొన్న కుప్పం, నిన్న విజయవాడ, నేడు నెల్లూరు.. రాష్ట్రంలో వరుసగా టీడీపీ నేతలపై వైసీపీ దాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఈ గొడవ వినాయక విగ్రహాల దగ్గర మొదలు కావడం విశేషం. టీడీపీ నేతలు పెట్టిన వినాయకుడి బొమ్మ నిమజ్జనం సమయంలో వైసీపీ నాయకులు అడ్డుపడి, వారి ట్రాక్టర్ ని అడ్డంగా పెట్టడంతో అర్థరాత్రి వరకు టీడీపీ నాయకులు బొమ్మతో రోడ్డుపైనే నిలబడిపోవాల్సి వచ్చింది. అక్కడ మొదలైన గొడవ చివరకు చినికి చినికి గాలివానలా మారి పొలం దగ్గర కొట్లాట వరకు వెళ్లింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లిలో జరిగింది. టీడీపీ నాయకుడు, ఆయన భార్యపై వైసీపీ నేతలు కాపుకాసి దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ నడుస్తోంది. ఇరు వర్గాలు ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. గాయపడిన బాధితులిద్దర్నీనెల్లూరు ఆస్పత్రికి తరలించారు. 


గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నాయని, అయితే ఇప్పుడు ఆ గొడవలు వినాయక విగ్రహం నిమజ్జనే వేళ పెరిగి పెద్దవయ్యాయని అంటున్నారు. వినాయక నిమజ్జనం జరిగిన తర్వాత రెండోరోజు మరోసారి గొడవలు జరగడంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవర్గంపై మరో వర్గం వారు దాడికి దిగడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన దంపతులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


అంతా సర్దుకుందంటున్న పోలీసులు..  పోలీసులు మాత్రం వెంటనే ఈ వ్యవహారంలో స్పందించారు. ఇరు వర్గాలను ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. రెండు వర్గాల వారితో కరచాలనం చేయించారు. ఇకపై గొడవలు పడొద్దని సూచించారు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఇరువర్గాలు కొంతసైపు వాదులాడుకున్నా ఆ తర్వాత కలసిపోయినట్టు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.