కర్నూలు జిల్లా సి బెళగల్ మండలానికి చెందిన ప్రకాష్ ఆచారి అనే వ్యక్తి తన ఇంటి పక్క స్థల వివాదంలో c.బెళగల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. అక్కడ ఎస్సై శివాంజనేయులను స్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు. అందుకు సంబంధించి డాక్యుమెంట్లను చూపారు. అయితే ఆ స్థల వివాదాన్ని పరిష్కరించాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగుతిన్న ప్రకాష్ ఆ సొమ్ము ఇచ్చేందుకు మొదట నిరాకరించాడు. ఆ తర్వాత విషయం కర్నూలు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి వారి దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచనలతో ఎస్సైతో మాట్లాడాడు ప్రకాష్. అనంతరం ఎసిబి డిఎస్పి శివ నారాయణ స్వామి సూచనల మేరకు ప్రకాష్‌... డబ్బు ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఆ సొమ్ము ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు. 


ఈ తంతు మొత్తం అచ్చం సినిమా స్టైల్‌లో సాగింది. ఒప్పందం చేసుకున్న ప్రకారం డబ్బును ముట్టచెప్పడంలో భాగంగా  కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోని మాంటిస్సోరి స్కూలు వద్దకు చేరుకున్నారు ఎస్సై, ప్రకాష్‌. రూ. 50 వేలు ఇచ్చేందుకు బాధితుడు సిద్ధమయ్యాడు. అక్కడికి వచ్చిన ఎస్ఐ రూ 50 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటివేసిన ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు.  


అధికారులు వచ్చిన సంగతి తెలుసుకున్న ఎస్సై.. ఆ సొమ్ము తనది కాదంటూ రోడ్డుపై పారేసి వెళ్లిపోయేందుకు ట్రై చేశాడు. అధికారులు అతన్ని పట్టుకొని విచారిస్తే అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత లంచం తీసుకుంటున్నట్టు అంగీకరించక తప్పలేదు. ఎస్ఐ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మాంటిస్సోరి స్కూలుకి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.


ఎస్సై గత కొంతకాలంగా భూ వివాదంలో సమస్యను పరిష్కరించడం కోసం కొంత మొత్తాన్ని లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలో స్పందన కార్యక్రమంలో కూడా జిల్లా ఎస్పీకి పలుసార్లు సమస్యను వివరించాడు. ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల కాలంలో ఆ రైతు ఎస్సైకు విషయాన్ని చెప్పాడు. దీంతో కొంత మొత్తాన్ని లంచంగా ఇస్తే సెటిల్ చేస్తానని నమ్మించాడు ఎస్సై. అలా అక్రమార్జనకు అలవాటు పడ్డ ఆ పోలీసు అధికారి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నాడు.