Anantapur Road Accident | పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఒక ఐషర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఐషర్, బస్సు డ్రైవర్లు సహా 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి, అత్యవసర చికిత్స కోసం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి, కొందరిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
