Macharla news: పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక న్యూటన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన హాస్టల్‌ గదిలో ఉరేసుకుంది. ఈ యువతి కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన రేణుకగా గుర్తించారు. తోటి విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది.


కర్నూల్ జిల్లా డోన్‌కు చెందిన రేణుక మాచర్లలో బీటెక్ చదువుతోంది. అక్కడ చెల్లెలిగా చూసుకునే ఓ సీనియర్ ఫోన్ చేయగా ఆమె ఫోన్ లేపకపోవడంతో తండ్రికి కాల్ చేసి అతను ఆరా తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కూతురిని మందలించాడు. అయితే మనస్తాపానికి గురైన కూతురు “నేను తప్పు చేయలేదు నాన్నా”.. నువ్వే నమ్మకుంటే ఇంకెవరు నమ్ముతారు అని లేఖ రాసి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 


చనిపోయిన యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గత నెలలో ఇదే కాలేజీలో ఓ విద్యార్థి అత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా అదే కాలేజీలో వరుస ఆత్మహత్యలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు, కొద్ది రోజుల క్రితం కర్నూలులోని ట్రిపుల్ ఐటీలో మన్యం జిల్లాకు చెందిన సాయికార్తీక్ నాయుడు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లోని 9వ అంతస్తు పైనుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలా విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.