టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. నల్లకాలువ పంచాయతీ సమీపంలో నారా లోకేశ్ పర్యటనలో భాగంగా అక్కడే ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం ముందు నుంచి పాదయాత్ర సాగుతోంది. నారా లోకేశ్ కాసేపు అక్కడ ఆగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వనానికి నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
99 రోజులకు చేరిన పాదయాత్ర
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం (మే 14) నాటికి 99వ రోజుకు చేరింది. నేడు శ్రీశైలం నియోజకవర్గంలోని వెలగాము వద్ద కొత్త రామాపురం గ్రామస్తులతో లోకేశ్ సమావేశం కానున్నారు. తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ తర్వాత అటవీ కార్యాలయం సమీపంలో స్కిల్డ్ అండ్ స్కిల్డ్ వర్కర్లతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం (మే 14) సాయంత్రం వెలుగోడులో ఎస్సీలు, బుడగ జంగాలు, స్థానికులతో సమావేశం కానున్నారు. రాత్రికి బోయ రేవుల శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు.
కాగా లోకేశ్ 100 రోజుల యువగళం పాదయాత్రకు సంఘీభావంగా సోమవారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, మాజీ మేయర్ కటారి హేమలత తెలిపారు. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గిరింపేట దుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పారు.
రైతులతో భేటీ
వెలగాము వద్ద గ్రామస్తులు యువనేత లోకేష్‌కు సమస్యలను చెప్పుకున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన సిద్దాపురం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మా పొలాలకు పిల్లకాల్వలు తీయించాలని కోరారు. అలాగే రైతులకు ఇచ్చిన డ్రిప్స్, స్ప్రింక్లర్లు, నల్లపట్టాలు, స్ప్రేయర్లు, సబ్సిడీపై ట్రాక్టర్లు ప్రస్తుత ప్రభుత్వం రద్దుచేసిందని, వాటిని పునరుద్దరించాలని కోరారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఇప్పటిదాకా పూర్తి చేయలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి, మిగిలిపోయిన రోడ్లు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరారు. అలాగే, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, గత ప్రభుత్వంలో మాదిరి మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ముఖం చూసి రాష్ట్రంలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అన్నారు. జగన్ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడానికి లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్దాపురం లిఫ్ట్‌కు అనుబంధంగా పిల్ల కాల్వల పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు విధానాన్ని పునఃప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలుచేస్తామని అన్నారు. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.