Nara Lokesh helps a Girl student  | తాడేపల్లి: చిన్నారికి చదువుకోవాలని ఉంది. అయితే సీటు రాని కారణంగా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని పత్తి పొలంలో కూలీగా మారింది జెస్సీ అనే బాలిక. ఆ విషయం తన దృష్టికి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆమెకు సీటుకు, చదువుకు భరోసా ఇచ్చారు.

Continues below advertisement

"చిట్టి తల్లీ, నిశ్చింతగా చదువుకో. కేజీబీవీలో (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) నీకు సీటు ఇప్పించడం నా బాధ్యత" అని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. కేజీబీవీలో సీటు రాకపోవడంతో పత్తి పొలాల్లో కూలీగా పని చేస్తున్న చిన్నారి జెస్సీ కథ తన మనసును కలచివేసిందని లోకేష్ తెలిపారు. చదువు పట్ల జెస్సీ చూపించిన ఆసక్తిని వెలుగు లోకి తీసుకువచ్చిన మీడియాను అభినందిస్తూ, ఆమెకు విద్యావకాశం కల్పించేందుకు తాను చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

పత్తి పొలాల్లో మగ్గిపోవడం చాలా బాధాకరం

Continues below advertisement

"ఇప్పటికే అధికారులతో మాట్లాడాను. నీకు కేజీబీవీలో సీటు ఖాయం. నిశ్చింతగా చదువుకో. పుస్తకాలు పట్టాల్సిన చిన్న చేతులు పత్తి పొలాల్లో మగ్గిపోవడం చాలా బాధాకరం" అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు.. మనం నమ్మే విద్యా మందిరాలు అని చెప్పిన లోకేష్, పిల్లలకు అందిస్తున్న వసతుల వివరాలను పేర్కొన్నారు. “చక్కని యూనిఫాం, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు, అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు మంచిది నేర్పించి, భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మాదే" అని నారా లోకేష్ తెలిపారు.

"పిల్లల భద్రత, భవిష్యత్‌ కోసం బడికి మించిన సురక్షిత ప్రదేశం మరొకటి లేదు. పిల్లలను చదువుకి దూరం చేయొద్దని తల్లిదండ్రులను కోరుతున్నాను. జెస్సీ లాంటి పిల్లలు తమ చదువుతో ఎదిగి, సమాజానికి తోడ్పడే స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, విద్యా ప్రమేయంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదని" అని లోకేష్ తల్లిదండ్రులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం..

మంత్రాలయం మండలం బూదూరుకు చెందిన మీనిగ కుమార్, సంతోషమ్మ దంపతులకు సంతానం ముగ్గురు. వీరి పెద్ద కుమారుడు నందవరం ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. మూడో కుమార్తె మను వారి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రెండో కుమార్తె జెస్సీ గ్రామంలో 5వ తరగతి పూర్తి చేసింది. గ్రామంలో పై తరగతులు లేవు. దాంతో చిలకలడోణలో కేజీబీవీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నా సీటురాలేదు. అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబానికి బారం కావడం ఇష్టం లేక తల్లిదండ్రుల వెంట కూలీ పనులకు వెళ్తోంది. తెలంగాణలో కొన్ని రోజులుల పత్తి పొలంలో పనులకు వెళ్లిన జెస్సీ రెండు రోజుల కిందట గ్రామానికి వచ్చింది. కేజీబీవీలో సీటు ఇప్పిస్తే చదువుకుంటానని అధికారులను కలిసి వేడుకుంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో చిట్టితల్లికి సీటు ఇప్పిస్తానని, ఆమె భవిష్యత్ ఇక్కడితో ఆగిపోకూడదు అన్నారు మంత్రి లోకేష్.