Andhra News in Telugu: అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టినా.. న్యాయస్థానాల్లో ఆయన నిజాయితీ నిరూపించుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) అన్నారు. సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ అంశంపై ప్రభుత్వం వేసిన పిటీషన్ కొట్టివేయడంపై ఆమె స్పందించారు. విజయవాడలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై పోరాడుతున్నారనే అక్కసుతో చంద్రబాబు(Chandrababu)పై అవినీతి మరక అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదుచేసి జైలుపాలు చేశారన్నారు. అయినప్పటికీ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు పోరాడుతున్నారని సునీత అన్నారు.
నిజం గెలవడానికి ఆలస్యం కావచ్చు కానీ !
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్ కు చెంప పెట్టు లాంటిది అన్నారు. అధికార గర్వంతో సీఎం జగన్ అండ్ కో పెట్టిన కేసులు నిరాధార కేసులు అని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. గతంలో హైకోర్టు చెప్పినా వినకుండా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. నిజం గెలవడానికి ఆలస్యం కావచ్చు కానీ కచ్చితంగా గెలుస్తుందనే విషయాన్ని ఇప్పటికైనా జగన్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా.. సభలకు వస్తున్న జనం చూస్తుంటే ఆయనపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతోందన్నారు.
టీడీపీకి 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్లు..
తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని.. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు ఇక ఎంతో దూరంలో లేవన్నారు. హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులే ఇలా అన్ని నేరాల్లో ఏపీలో ముందంజలో ఉందన్నారు. కానీ ప్రజలకు మంచి చేయడంలో మాత్రం చివరన ఉందని కామెంట్ చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీ మ్యానిఫెస్టోపై హర్షం వ్యక్తం చేస్తున్నారని.. కచ్చితంగా చంద్రబాబును మరోసారి సీఎం చేసుకుంటారన్నారు. ఈ విషయాన్ని గమనించి.. అలాగే జగన్ రెడ్డి పెత్తందారీ వ్యవస్థకు విసిగిపోయిన వైసీపీ నేతలంతా టీడీపీలో చేరుతున్నారని.. చేరికలు మరిన్ని రోజులు కొనసాగుతాయని పేర్కొన్నారు. త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని మాజీ మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు.