కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ.. రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు రాజ్ విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాయలసీమ ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జేఏసీ నేతలు ఉద్యమబాట పట్టారు.
కర్నూలు నగరం ఆనాటి కాలంలోనే ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉంది. ఆరోజు అభివృద్ధి పేరిట రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శ్రీ భాగ్ ఒడంబడిక ద్వారా రాయలసీమ వాసులకు తాగునీటి సౌకర్యం నిధులు నియామకాలలో వెసులుబాటు ఉంటుందనుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి సౌకర్యాలు లేకుండా నేటికీ రాయలసీమ ప్రాంతం కరవు కాటకాలతో వెనుకబడి ఉందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కర్నూలు నగరంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేసి విధులను నిర్వహించాలని అన్ని రంగాల ప్రముఖులు డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షం వారు వ్యతిరేకించడం మూర్ఖత్వపు చర్యగా రాయలసీమ మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతవాసులు పోరాటాలకు సిద్ధం కావాలని న్యాయ రాజధాని కచ్చితంగా ఏర్పాటు చేయాలని తమకు వచ్చే నెల జీతాన్ని ఉద్యమానికి ఇస్తానని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ప్రకటించారు.
ఎప్పుడూ త్యాగాలేనా... తిరుగుబాటు లేదా...!
రాయలసీమ ప్రజలు త్యాగాలకు ప్రతీక ఆనాటి నుంచి నేటి వరకు రాయలసీమ వనరులను అందరూ అనుభవిస్తున్నారు కానీ ప్రజలు మాత్రం కరవు కాటకాలు వలసలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ సంజీవ్ కుమార్. ఆస్తులు పెంపొందించేందుకు ఒక రియల్ ఎస్టేట్ రాజధాని నిర్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. దీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. అందులో భాగంగా కర్నూలుకు రాజధాని ప్రకటించారని వివరించారు.
హైకోర్టు సాధన ఉద్యమానికి నేతల జీతాలు...!
ప్రభుత్వం చేపట్టే చర్యలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటన్నారు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ . రాయలసీమ ప్రజల ఓట్లతో గతంలో అధికారాన్ని అనుభవించారని అది మర్చిపోయి ప్రవర్తించడం రాయలసీమ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తప్పకుండా భవిష్యత్తులో టిడిపి, జనసేన, బీజేపీకి రాయలసీమ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని శాపనార్థాలు పెట్టారు. న్యాయ రాజధాని ఉద్యమం రాయలసీమ ప్రజల బాధ్యతని... న్యాయవాదులు, మేధావులు, యువకులు ఈ ఉద్యమాన్ని నీరు కార్చకుండా అందరూ కలిసి సాధించుకోవాలని సూచించారు. దీని కోసం తన నెల జీతం రెండు లక్షల 90వేలు ఉద్యమ నిధికి ఇస్తున్నానని ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు.
రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలు లేక నీళ్ళు నిధులు పంపకాల్లో కూడా వివక్ష చూపుతున్నారని రాయలసీమ ప్రాంతం వాసులకు ముమ్మాటికీ మోసపోతున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతానికి కేంద్ర బిందువు అయిన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి పాలనను కొనసాగించాలని కోరారు.
ఒక రాష్ట్రానికి రాజధానిని కార్య,శాసన, న్యాయ రాజధానులను ఒకే చోట ఉండాలని నిబంధన లేదన్నారు నేతలు. ఆ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే ఉంటుందని తెలిపారు. మూడు రకాలైనటువంటి పరిపాలన విధానాలను ఒకచోటి నుంచే పాలించడం ద్వారా ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది అనే అపోహలు ఉన్నాయన్నారు.
భవిష్యత్తు కార్యాచరణ ద్వారా ఉద్యమం...!
సమావేశంలో పాల్గొన్న పలువురు మేధావులు, రాజకీయ వ్యక్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ ఒక కార్యచరణ రూపొందించుకోవాలని తీర్మానం చేశారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో విడుదల చేస్తామని నేతలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు మేల్కొని పోరాటాలకు సిద్ధమవ్వాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాజధాని ఏర్పాటుకు రాజీనామాలు చేయాలని సూచించారు.
వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల వారం క్రితం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి 'న్యాయ' గళాన్ని వినిపించారు. రెండు రోజుల కిందట రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించిన జేఏసీ నేతలు కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.