Kurnool News: కర్నూలు జిల్లా (Kurnool District) నంద్యాలలో (Nandyal) వైసీపీ నాయకుడి కుమారుడిగా భావిస్తున్న ఓ యువకుడు రెచ్చిపోయాడు. అమ్మాయి విషయంలో అడ్డొస్తున్నాడని ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడు. తండ్రి బ్యాక్ గ్రౌండ్‌ను అడ్డు పెట్టుకొని వైసీపీ నేత కుమారుడు రెచ్చిపోయాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. పోలీసులు స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాలు ఇవీ..


నంద్యాల పట్టణ వైఎస్ఆర్ సీపీ (YSRCP) నాయకుడు, ప్రథమ నంది ఆలయ ఛైర్మన్ తిరువీధి ప్రసాద్ కుమారుడు మణికంఠ, సాధిక్ నగర్ కు చెందిన సాయి హేమంత్ పై దాడి చేసేందుకు పథకం రచించాడు. నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న సాయి హేమంత్ ను  మణికంఠ, అతని మిత్రుడు రామకృష్ణ కళాశాల వద్ద కలిశారు. మీ నాన్నకు ప్రమాదం జరిగిందని చెప్పి సాయి హేమంత్ ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ప్రథమ నందిలోని కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి సాయి హేమంత్ ను చితక బాదడంతో పాటు కత్తులతో గుచ్చి చిత్ర హింసలకు గురిచేశారు. ఆ తర్వాత యువకుడి తండ్రి వరప్రసాద్ ను అక్కడికి పిలిపించారు. 


రెండు మూడు రోజుల్లో మీ అబ్బాయిని కళాశాల మాన్పించి, నంద్యాల (Nandyal) వదిలి వెళ్లాలని బెదిరించారు. లేదంటే తండ్రీ కుమారులను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో వారు ఊరు వదిలి వెళ్లిపోతామని చెప్పి బయటపడ్డారు. గాయాలైన సాయి హేమంత్ ను నంద్యాల (Nandyal) ప్రభుత్వ ఆసుపత్రిలో (Nandyal Govt Hospital) చేర్పించారు. అనంతరం తండ్రి రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ యువతి విషయంలో తన కుమారుడు చేయని తప్పునకు అన్యాయంగా కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేశారని వరప్రసాద్ వాపోయారు. తండ్రి వైఎస్ఆర్ సీపీలో (YSRCP) ఉన్నందునే మణికంఠ ఇలా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.