Kurnool MP Sanjeev Kumar is likely to join TDP : వైఎస్ఆర్‌సీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన ఈ విషయాన్ని  విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ సారి టిక్కెట్ల కసరత్తులో సీఎం జగన్ అసలు ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆలూరు నుంచి అసెంబ్లీ టిక్కెట్ నిరాకరించబోతున్న మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. తన గురించి పట్టించుకోకపోతూండటం.. కనీసం అసెంబ్లీ టిక్కెట్ అయినా  కేటాయించేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోతూండటంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.                   

  


బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్‌ కుమార్ ఇటీవల టీడీపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.    కర్నూలు నగరంలో ప్రముఖ డాక్టర్‌‌గా సంజీవ్‌ కుమార్‌ గుర్తింపు పొందారు. ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, ఢిల్లీలో ఒకరిద్దరు ఎంపీలు మినహా మిగిలిన వారంతా సొంతంగా పనిచేసే అవకాశాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  ఈసారి ఎంపీగా కాకుండా.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు అవకాశం ఇస్తారని సంజీవ్ కుమార్ అనుకున్నారు. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సూచన మేరకు మాచాని వెంకటేష్ అనే నేతకు టిక్కెట్ కేటాయించారు.  తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మిగనూరులో మెజారిటీ ఓటర్లుగా ఉన్నారని చాన్సివ్వాలని కోరినా హైకమాండ్ పట్ిటంచుకోలేదు.  


సంజీవ్ కుమార్ కు కొంత కాలంగా కర్నూలు వైసీపీ నేతలతోనూ సరిపడటం లేదు.   పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు.. ఇలా కొందరు నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. కొన్ని సందర్భాల్లో ఆ విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ మారాలని సంజీవ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో ఆయనకు టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నదనిపై స్పష్టత లేదు. సర్వేలను బట్టి టిక్కెట్ కేటాయిస్తామని టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో కర్నూలు నుంచి వైసీపీ తరపున గెలిచిన బుట్టా రేణుక కూడా టీడీపీలో చేరి మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. రాజకీయంగా ఆమె పూర్తిగా ప్రాధాన్యత కోల్పోయారు.                


రాజకీయ పార్టీలు టిక్కెట్ల కసరత్తులో వేగం పెంచడంతో చాన్స్ రాని వాళ్లు ఇతర పార్టీలను చూసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ టిక్కెట్ ఈ సారి కేశినేని నానికి ఇవ్వడం లేదని స్పష్టత ఇవ్వడంతో ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ కోసం ఆయన సీఎం జగన్ ను కలిశారు.