Kurnool Collector alerts MROs over Karnataka's Tungabhadra Dam Gate Washed Away | కర్నూలు: నీటి ప్రవాహం అధికం కావడం, టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల తుంగభద్ర డ్యామ్ 19 వ గేటు కొట్టుకుపోయింది. దానివల్ల 90 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కుల నీళ్లు విడుదలయ్యాయి. దిగువకు భారీగా నీళ్లు విడుదల కావడంతో మంత్రాలయం, కౌతాళం, సి. బెళగల్, కోసిగి, నందవరం, తహసీల్దార్లు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు.
ఎస్పీ, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, జలవనరుల శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. శనివారం రాత్రి తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయింది. దాంతో డ్యాం నుంచి నీళ్లు విడుదల కావడంతో మంత్రాలయం, కౌతాళం, కోసిగి, నందవరం తహసీల్దార్లను నేటి ఉదయమే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. దండోరా వేయడం, మైక్ ద్వారా ప్రకటన చేయడం ద్వారా ప్రజలకు నీటి విడుదల విషయాన్ని ప్రజలకు చెప్పి, నది కాలువలోకి దిగనివ్వకుండా, చేపలు పట్టడానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈరోజు ఉదయం మరో 90 వేల క్యూసెక్కుల నీటి విడుదలతో మంత్రాలయం, నందవరం, కౌతాళం, కోసిగి తహసీల్దార్లు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ వారిని అప్రమత్తం చేశారు. అలాగే సి.బెళగల్ తహసీల్దార్ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాత్రికి ఏపీ బార్డర్లోకి నీళ్లు వస్తాయని, రేపు (సోమవారం) ఉదయం మంత్రాలయం, రేపు సాయంత్రానికి సుంకేసుల చేరుతుందన్నారు. రాత్రి వదలిన 40 వేల క్యూసెక్కుల నీరు మేలిగనూరు క్రాస్ అయిందని, దాంతో వీఆర్వో, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రెటరీ లను ఉంచి ప్రజలు నదిలోకి, కాలువల్లోకి దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్నిచోట్ల నీటి ప్రవాహం చూసి చేపలు పట్టడానికి వెళ్తారని, వారికి సైతం సూచనలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ నీటి ప్రవాహ పరిస్థితిపై పర్యవేక్షణ చేయాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
ఎమ్మార్వోలు ఎస్డీఆర్ఎఫ్ టీంలను సిద్ధంగా ఉంచుకోవాలని, టీమ్స్ వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్పీ జి.బిందు మాధవ్ ను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆధోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మను అలర్ట్ చేశారు. లైసెన్స్డ్ ఫిషర్ మెన్ ను లైఫ్ జాకెట్లు, పుట్టీలతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఫిషరీస్ అధికారిని ఆదేశించారు. ఆధోని సబ్ కలెక్టర్, మంత్రాలయం, కౌతాళం, నందవరం, కోసిగి తహశీల్దార్లతో కలెక్టర్ మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, తగినంత సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నామని సబ్ కలెక్టర్, తహసీల్దార్లు కలెక్టర్ కు వివరించారు. ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.