Former MLA PV Sidda Reddy News: వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి తాను ఎప్పుడు ద్రోహం చేయలేదని.. పార్టీనే తనకు ద్రోహం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఇటుక ఇటుక పేర్చి పార్టీని బలోపేతం చేస్తే పార్టీ తనకు సస్పెండ్ అనే బహుమతిని ఇవ్వడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కదిరిలో ఎమ్మెల్యేగా ఉండగానే తనను కాదని కొత్త ఇన్ ఛార్జిని తీసుకొని వచ్చి అధిష్ఠానం తనను అవమానపరిచిందని అన్నారు. అధికారులకు తాను ఫోన్ చేస్తే పలకవద్దని అధికారులను కొందరు పార్టీ పెద్దలు కట్టడి చేశారని పార్టీ అధిష్టానం మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


జగన్ తనకు నేరుగా చెప్పి ఉండి ఉంటే నేను తప్పులను సరిచేసుకునే వాడిన అన్నారు. కొంతమంది వెధవలు డబ్బు కోసం పదవుల కోసం పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. మక్బూల్ వద్ద రూ.10 కోట్లు తీసుకొని అతణ్ని ఓడించారని వారిని పార్టీ గుర్తించలేదన్నారు. రేపటి నుంచి తన రాజకీయం మళ్లీ మొదలవుతుందని.. తాను ఏంటో చూపిస్తానని అన్నారు. ఏ పార్టీలో చేరాలన్నది తమ ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సిద్ధారెడ్డి వెల్లడించారు.


 వైసీపీ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సస్పెండ్


వైఎస్ఆర్సిపి పార్టీ నేత కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు కీలక నాయకులను వైసిపికి వ్యతిరేకంగా పనిచేసినట్లు అధిష్టానం గుర్తించింది. 


తెలుగుదేశం పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకొని వైసీపీ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా పనిచేసినట్లు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పై వేటు పడింది. త్వరలోనే మరి కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసిపి పార్టీలో కొంతమందిపై అధిష్టానం గుర్రుగా ఉంది. దీంతో పార్టీలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉపేక్షించదని డైరెక్ట్ గానే సంకేతాలను అయితే పంపిస్తున్నట్లు తెలుస్తోంది.


 గత ఎన్నికల్లో కదిరి వైసీపీ అభ్యర్థిగా మక్బూల్ బాషా


రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారన్న సర్వే రిపోర్ట్ తో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వ్యక్తులను అభ్యర్థులుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూ వచ్చాడు. ఇందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాదని ముస్లిం మైనార్టీ కి చెందిన మక్బూల్ భాషకు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆయన వర్గం మక్బూల్ బాషాకు సహకరించలేదని ఒక ప్రచారం జరిగింది. వీటన్నింటి పైన మక్బూల్ బాషా వర్ధన్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులను జారీ చేశారు.