కడప: కడప నగరపాలక సంస్థ (Kadapa Municipal Corporation) మేయర్ ఎన్నిక నిర్వహణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ 2 రోజుల కిందటే మేయర్ ఎన్నిక కోసం ఉత్తర్వులు జారీ చేయడంతో, జాయింట్ కలెక్టర్ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం డిసెంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటలకు కడప కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
మేయర్‌గా సురేష్ బాబు తొలగింపు, తప్పనిసరి ఎన్నికఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆయనపై కూటమ సర్కార్ చర్యలు తీసుకుంది. అనంతరం, కడప డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్‌ఛార్జ్ మేయర్‌గా నియమించారు. అయితే, ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుంది. కడప నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించడం తప్పనిసరి. పాలనా అవసరాల దృష్ట్యా కడప మేయర్‌ను ఎన్నుకోవడం అనివార్యం కావడంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు మేయర్ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
హైకోర్టులో మాజీ మేయర్ పిటిషన్ఎన్నికల కమిషన్ కడప మేయర్ ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ, మాజీ మేయర్ సురేష్ బాబు శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను మేయర్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు డిసెంబర్ 9న విచారణ జరపనుంది. హైకోర్టు తీర్పు తరువాత కడప మేయర్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ ఎన్నికకు సంబంధించి రాజకీయ వర్గాల్లో, నగరపాలక సంస్థ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.