అనంతపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ పర్యటన కొనసాగుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేస్తున్నారు పవన్ కల్యాణ్. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఆయన ఓ రైతు ఫ్యామిలీని పరామర్శించారు. కౌలు రైతు కలుగురి రామకృష్ణ భార్య బిడ్డలను ఓదార్చి వాళ్లకు లక్ష రూపాయాల ఆర్థిక సాయం చేశారు. 


అసలు ఎలా నష్టపోయారు.. ఫ్యామిలీ సమస్యలు రామకృష్ణ భార్య నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఆమెతోపాటు వాళ్ల బిడ్డలతో కాసేపు మాట్లాడారు. కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రామకృష్ణ కుమారుడు మహేష్ మాట్లాడుతూ 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్లమని పంటనష్టం, చేసిన అప్పులు తీర్చలేక నాన్న అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డారని బోరుమన్నారు. 






తన తండ్రి చనిపోయి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇంటికి రాలేదన్నారు మహేష్. కానీ పవన్‌ వస్తున్నారని తెలియగానే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారని ఫోన్ చేసి మరి చెబుతున్నార వివరించారు.


తర్వాత ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వారి స్థితిగతులు తెలుసుకున్నారు. సమస్యలు అడిగారు. పార్టీ తరఫున లక్ష రూపాయల చెక్ అందజేశారు. 






ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తోపాటు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు టి.సి.వరుణ్ పాల్గొన్నారు.


పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నేడు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రాష్ట్రంలో 1019 మంది , రెండో ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్సీఆర్బీ (NCRB)కి ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెడుతోందని చెప్పారు. 


కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు.