High Tension In Kurnool : వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ రెడీ అయింది. ఉదయాన్నే కర్నూలు చేరుకున్నా సీబీఐ ప్రత్యేక బృందం కర్నూలు ఎస్పీని కలిశారు. విచారణకు సహకరించని అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నామని సమాచారం ఇచ్చారు. దీంతో కర్నూలులో టెన్షన్ వాతావరణం మొదలైంది.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తున్నామని దాని ప్రక్రియ పూర్తి చేయాలని కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు తేల్చి చెప్పారు. ఆయన లొంగిపోయేలా చూడాలని కూడా సూచన చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారనే వార్త తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిస్థితి కాస్త హాట్‌హాట్‌గా మారింది. వారిని నిలువరించేందుకు పోలీసులు భారీగా మోహరించాల్సి వచ్చింది.
కాసేపట్లో సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రికి రానున్నారు. అంతకంటే ముందే వైసీపీ కార్యకర్తలు అక్కడికి రావడంతో సీబీఐ అధికారులు పోలీస్ ఫోర్స్ కోసం రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. పోలీస్ ఫోర్స్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే ఛాన్స్ ఉంది.