DRDO Experiments in Kurnool district | కర్నూలు: భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా గణనీయమైన ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ రంగానికి సంబంధించి కీలక ప్రయోగం చేశారు. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మన దేశంలోనే తయారైన ఓ మిస్సైల్‌ను యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ ULPGM-V3ని కర్నూలు జిల్లాలో విజయవంతంగా ప్రయోగించారు. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో డ్రోన్ ద్వారా మిస్సైల్‌ను డీఆర్‌డీవో శుక్రవారం నాడు విజయవంతంగా ప్రయోగించింది. 

కర్నూలు జిల్లాలో NOAR పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగాలు..

భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా DRDO  ప్రయోగించిన UAV ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3కి సంబంధించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. డ్రోన్ నుంచి మిస్సైల్స్‌ను ఏ సమస్య లేకుండా ప్రయోగించింది. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో జరిగాయని రక్షణ శాఖ తెలిపింది.  డీఆర్‌డీవోకు చెందిన NOAR పరీక్షా కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో ఎంచుకున్నారు. గతంలోనూ డైరెక్టెడ్ ఎనర్జీ వెషన్స్ సిస్టమ్‌ను పరిరక్షించేందుకు ఇదే వేదికగా ప్రయోగాలు చేశారు. 

డీఆర్‌డీవో, భాగస్వామ్య సంస్థలపై రాజ్‌నాథ్ ప్రశంసలు

ఈ విషయాన్ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో డీఆర్‌డీవోతో పాటు మిస్సైల్ తయారీలో భాగస్వాములైన స్టార్టప్స్, MSMEలను ఆయన ప్రశంసించారు. "భారతదేశ రక్షణ సామర్థ్యాలకు మరింత ఊతమిచ్చేలా DRDO ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) ప్రయోగించిన యూఏవీ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3 యొక్క విమాన పరీక్షలు విజయవంతమయ్యాయి" అని పేర్కొన్నారు.

మోడ్రన్ మిస్సైల్ వ్యవస్థను రూపొందించడంతో విజయవంతంగా పరీక్షించినందుకు DRDO, దాని భాగస్వాములైన డిఫెన్స్ క్యాపిటల్ ప్రొక్యూర్‌మెంట్ పార్టనర్స్ (DcPPలు), మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEలు), స్టార్టప్‌లకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. దేశీయంగా సరికొత్త టెక్నాలజీతో ఆత్మనిర్భర్ భారత్ ద్వారా సత్తా చాటడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం రక్షణ రంగంలో మరో మైలురాయి లాంటిదన్నారు.  దేశంలో అత్యాధునిక రక్షణ ఆవిష్కరణలలో స్వదేశీ టెక్నాలజీ పెరుగుతుందని స్పష్టం చేశారు.