నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో సెలవు రోజులు కావడంతో భక్తులు పెద్ద స్థాయిలో చేరుకొని దర్శనాలు చేసుకున్నారు. జనాలతో పండగ వాతావరణం తలపించేలా మహానంది దైవ క్షేత్రము భక్తులతో కిటకిట లాడుతున్న సమయంలో ఆలయ ఆవరణంలో ఒక్కసారిగా డ్రోన్‌ సంచారం కలకలం రేపింది. డ్రోన్‌ సహాయంతో ఓ అంగతకుడు దేవాలయం ఏరియవల్‌ వ్యూను చిత్రీకరించాడు. దీంతో ఆలయంపై డ్రోన్‌ తిరుగుతుండడాన్ని గమనించిన ఆలయ సిబ్బంది. రంగంలోకి దిగి డ్రోన్‌ కదలికలను గమనించి ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే డ్రోన్‌ను ఆపరేట్‌ చేస్తున్న వ్యక్తిని గుర్తించి అతడు ఉన్న స్థానానికి వెళ్లారు. అయితే అప్పటికే అప్రమత్తమైన అంగతకుడు తనను గమనిస్తున్నారని అనుమానంతో అక్కడి నుంచి తన కారులో పారిపోయాడు. అతని కోసం దాదాపుగా 6 కిలోమీటర్లు మేర వెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 


కారులో పారిపోతున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఆలయ సిబ్బంది ఆరు కిలోమీటర్ల వరకు వెంబడించినా నిందితుడు తప్పించుకున్నాడు. ఆలయ ఈవో ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ సాయంతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫుటేజ్లో నిందితుడి దృశ్యాలు, కారు నెంబర్‌ సరిగ్గా కనిపించకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. దేవాలయాలపై డ్రోన్‌ సంచారం పలు అనుమానాలు దారి తీస్తోంది. అంగతకుడు దేవాలయాన్ని ఎందుకు టార్గెట్‌ చేసుకున్నాడనే ప్రశ్న తలెత్తుత్తోంది.


ఆలయం లోపలికి డ్రోన్ రావడంపై అనుమానాలు...


రాజకీయ ప్రముఖులు వచ్చే దారి, రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాల్లో డ్రోన్లు సంచరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాంకేతికత పెరిగినప్పటి నుంచి గుర్తు పట్టలేని ప్రాంతంలో ఉంటూ డ్రోన్‌ను ఆపరేట్ చేస్తూ రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఏరియల్ రివ్యూతో కదలికలను గుర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని దేవాలయాలు ప్రముఖమైన ప్రదేశాలలో డ్రోన్‌ల సంచారం ఎక్కువైపోతోందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. 


విషయం తెలిసి ఎంటరైన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అగంతకుడు ఏ ఉద్దేశంతో డ్రోన్‌ను మహానంది దేవాలయంపై వాడారన్న కోణంలో పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోంది. గతంలో డ్రోన్లను వినియోగించిన వారిని ప్రశ్నిస్తే వివిధ రకాల షార్ట్ ఫిలింల కోసం, అందమైన చిత్రాల కోసం, ఆహ్లాదకరమైన వీడియో షూట్‌ల కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎందు కోసం చేసినా పోలీస్ శాఖ అనుమతితోనే డ్రోన్‌లు ఉపయోగించాలని పోలీసులు చెబుతున్నారు. అలా కాకుండా ఇష్టారీతిన డ్రోన్‌లతో చిత్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 
 
డ్రోన్‌ల ద్వారా సమాచారాన్ని సేకరించి రాబోయే రోజులలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారా అన్న కోణంలో పోలీస్ శాఖ అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టింది. మరోవైపు టైట్‌ సెక్యూరిటీ ఉన్నప్పటికీ డ్రోన్ ఆలయం లోపలికి ప్రవేశించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన వారిని గుర్తించి ఆలయాల సంరక్షణకు కృషి చేయాలని  అభిప్రాయపడుతున్నారు.