Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారిపోయింది. చత్తీస్​గఢ్, మహారాష్ట్ర మీదుగా ఏర్పడిన ఆవర్తనం, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు మీదుగా ఇంకో ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు కలిపి తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే వాతావరణంలో మార్పులు వచ్చాయి అధికారులు చెబుతున్నారు. 

ఆవర్తనాల కారణంగా నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల్లో పిడుగుల వర్షం పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉరుములతో కూడిన వర్షం పడుతుందని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు చెబుతున్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని సూచించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల్లోపే ఉన్నట్టు వెల్లడించారు. 

మరో రెండు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ విచిత్రమైన వాతావరణ అంచనాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.