కర్నూలు జిల్లా మండలం దేవరగట్టులో నేటికీ వింత ఆచారం కొనసాగిస్తున్నారు. దసరా ఉత్సవాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ముందుగా గుర్తొచ్చే కర్రల సమరం. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఎంతో ఆసక్తికరంగా సాగే దేవరగట్టు ఉత్సవాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అర్ధరాత్రి జరిగే బన్నీ (కర్రల సమరం) నియంత్రణకై పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రతి ఏటా సంప్రదాయంగా జరిగే బన్నీ ఉత్సవం ఈసారి ఎలా జరుగుతుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సాంప్రదాయం ఆచారాలు ఉంటాయి. అయితే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలో ఉన్నా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవం ప్రత్యేక వింత ఆచారం నేటికి కొనసాగిస్తున్నారు. ఆ ఆచారం ఇక్కడ చూసే వాళ్లకు అది యుద్ధమే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం తలపించే వింతైన శబ్దాలతో దేవరకొట్టు ప్రాంతమంతా అలుముకుంటాయి.
అక్కడ అదొక ఆచారం.. దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ క్రీడ కానీ అక్కడ జరిగే సీన్లు చూస్తే దడ పుట్టాల్సిందే. కళ్లలో భక్తి, కర్రలో పౌరుషం. టెంకాయల్లా తలల్ని పగలగొట్టే ఆచారం. ఈ ఏడాది కూడా కర్రల సమరానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు. ఇవాళ అర్థరాత్రి దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరుగనుంది. అయితే.. ఈ దేవరగట్టు కర్రల సమరం ఉత్కంఠ రేపుతోంది. ప్రతి ఏటా జరిగే హింస ఈసారి కూడా జరుగుతుందా అనేదానిపై స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి. ప్రభుత్వం నుండి ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా గతంలో కేంద్ర బలగాలను సైతం భద్రతగా పెట్టినా కర్రల సమరం అదుపు చేయలేక ఆ ఉత్సవాన్ని నేటికీ అలానే కొనసాగిస్తున్నారు.
దేవర గట్టులో పూర్వ చరిత్ర
పూర్వం ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు, తపస్సులు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారని అదే ప్రాంతంలో మని.. మల్లసూరులు అనే రాక్షసులు కూడా నివాసముంటూ లోక కల్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజ కార్యక్రమాలకు భంగం కలిగిస్తూ ఉండేవారని వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారని అంటారు.
మిమల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు సూచించగా మునులు వైకుంఠానికి వెళ్లి శరణు, శరణు విష్ణు దేవా అంటూ వెళ్లి వేడుకున్నారు. మని మల్లసూరులు శివుని భక్తులని వారిని సంహరించడం తన వాల్ల కాదని పరమేశ్వరుడి వద్దకు వెళ్లాలని విష్ణుమూర్తి సూచించడంతో కైలాసం వెళ్లి రాక్షసుల బారి నుంచి తమను కాపాడలంటూ వేడుకున్నారు. దీంతో పరమేశ్వరుడు మని మల్లాసురులను అంతమొందిస్తానని వారికి హామీ ఇచ్చాడని అంటారు.
అలా పరమేశ్వరుడు కాల భైరవుడి అవతారంలో దేవరగట్టు కొండల్లో యుద్ధం సాగిస్తాడు. మని అనే రాక్షసుడిని అంతమొందిస్తాడు. ప్రాణాలు విడిచే సమయంలో తన చివరి కోరికను తీర్చాలని వేడుకుంటాడు. ఏం వరం కావాల్లో కోరుకో అని శివుడు అడగగా ఉత్సవాలకు వచ్చే కొందరి భక్తులను ఆహారంగా బలి ఇవ్వాలని కోరగా అందుకు పరమ శివుడు అంగీకరించి తథాస్తు అని చెప్పే సమయంలో పార్వతి దేవి అడ్డు చెప్పింది. మీరు కోరిన వరం తప్పు అని భక్తులను బలి ఇవ్వడం కుదరదని వేరే వరం కోరుకోవాలని కోరింది. భక్తుల నుంచి ప్రతి ఏటా కుండ నిండా రక్తం సమర్పించాలని మని మల్లాసూరులు కోరగా అందుకు పార్వతి దేవి అంగీకరించి ప్రతి ఏటా జరిగే దేవరగట్టు ఉత్సవాల్లో తన భక్తుల నుంచి పిడికెడు రక్తాన్ని ఇచ్చేలా రక్షపడి వద్ద వరం ఇవ్వడంతో అక్కడే రాక్షసులు ప్రాణాలు వదిలినట్లు చరిత్ర చెబుతోంది.
ఆ పిడికెడు రక్తం ఇచ్చేందుకు ప్రతి ఏటా రక్షపడి వద్దకు వచ్చే భక్తులను గొరవయ్యలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో భక్తులు మాళమ్మ విగ్రహాన్ని తీసుకొని వెళ్లి పూజారి దబ్బనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే కేకలు వేస్తూ బన్నీ జైత్ర యాత్రలో జరిగే కర్రల సమరంలో కర్రలతో కొట్టుకోవడం, తలలు పగిలి రక్తం చిందిచడం తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయంగా భావిస్తున్నారు. యుద్ధం జరిగే సమయంలో వెళ్తున్న పరమేశ్వరుడికి ముళ్ళు గుచ్చుకొని ముళ్ల బండ సేద దీరిన ప్రాంతాన్ని ముళ్ల బండగా పిలుస్తారు.
పొరుగు రాష్ట్రాల నుంచీ జనం
బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా జనం తరలివస్తారు. ఈ నేపథ్యంలో వారికి తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ సిద్ధార్థ కౌషల్, కలెక్టర్ కోటేశ్వరరావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్, వైద్య శాఖ, ఫైర్ సిబ్బంది అధికారులంతా అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు. కాగా, కర్రల సమరంలో గతంలో అల్లర్లకు దిగిన దాదాపు 200 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. మరో 300 మందిపై బైండోవర్ కేసుల నమోదుకు చర్యలు చేపట్టారు. బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాటుసారా తయారీ కేంద్రాలు, కర్నాటక నుంచి తీసుకొచ్చే మద్యం అక్రమ నిల్వలపై నిఘా ఉంచారు. ఉత్సవ మూర్తులను తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడటం ఆ క్రమంలో వ్యక్తిగత కక్షలకు కూడా కొందరు వేదికగా మార్చుకుంటున్నారు.