CM Jagan Nandyal Tour: సుపరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని.. పారిశ్రామికాభివృద్ధికి చేయూత ఇస్తున్నామని జగన్ తెలిపారు. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పరిశ్రమలో 1000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీనే ఉదాహరణ అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. 


'మూడోసారీ మనమే నంబర్ వన్'


ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా 3వ సారి మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఈ ఘనత సాధ్యం అయిందని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనలో ఉన్న ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ సర్కారు అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని, రైతులకు మంచి జరగడంతోపాటు ఉద్యోగవకాశాలు వస్తాయని, రానున్న 4 ఏళ్లలో 20 వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని సీఎం జగన్ తెలిపారు. "ఈ సారి పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తే ఎకరాకు ఏడాదికి రూ. 30వేల లీజు చెల్లిస్తాం. మూడేళ్లకు ఒకసారి 5 శాతం లీజు పెంచుతాం. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలి. గ్రోత్ రేటులో దేశంలో ఏపీ నంబర్ వన్ గా ఉంది. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి" అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. 


పరిశ్రమల స్థాపనకు సర్కారు ప్రోత్సాహం


ఏపీ సర్కారు అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు తమ పరిశ్రమలను పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జయజ్యోతి, జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండగా.. తాజాగా కల్వటాల వద్ద రూ. 1,790 కోట్లతో రామ్ కో పరిశ్రమను నెలకొల్పింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయి. రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సర్కారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోంది. దీంతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. 


ప్రస్తుతం రామ్ కో ఏర్పాటు చేసిన కంపెనీ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుండి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. 2018 డిసెంబర్ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కానీ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్ కో తన పరిశ్రమ ఏర్పాటును వేగవంతం చేసింది. పనులు త్వరిగతన పూర్తి చేసి పరిశ్రమను ప్రారంభించింది.