ఎనిమిదో తరగతికి వచ్చిన ప్రతి విద్యార్థికి ట్యాబ్ అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం తాము రూ.500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అక్టోబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తామని చెప్పారు. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలని, నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీలో స్కూళ్లు పున:ప్రారంభం అయిన సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక కిట్లను అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 47.70 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక ద్వారా ప్రయోజనం అందనుందని సీఎం జగన్ తెలిపారు.


ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్యను అందించే ఉద్దేశంతో వారికి అన్ని వసతులు కల్పిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈ మేరకు వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ కార్యక్రమం జరిగింది.  ప్రసంగం పూర్తయ్యాక విద్యా కానుక కిట్లను సీఎం జగన్ విద్యార్థులకు అందించారు.


‘‘47 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాకానుకను ఇస్తున్నాం. విద్యాకానుక కోసం ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నేడు ఇచ్చే విద్యాకానుకతో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా రూ.2,368 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు చక్కని ఆహారం అందిస్తున్నాం. ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్‌ యాప్‌తో ఒప్పందం కుదుర్చుకొని, పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్‌ (తెలుగు, ఇంగ్లీషు) టెక్ట్స్ బుక్స్ ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వం మనది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్‌ విలువ రూ.2 వేలు ఉంటుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.


కిట్లలో ఉండేవి ఇవే..
స్కూలు మొదలయ్యే నేటి నుంచి నెలాఖరు వరకూ ఈ కిట్లను అందిస్తారు. ప్రతి విద్యార్థికి ఇచ్చే ఈ కిట్ లో ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్‌ (తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉండే) టెక్ట్స్ బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుంది. ఈ ఒక్కో కిట్‌ విలువ దాదాపు రూ.2 వేలు. ఇందుకోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. ఈ విద్యా సంవత్సరం కోసం రూ.931.02 కోట్లు ఖర్చు పెడుతోంది. 


ఆదోనికి వరాలు
ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ను త్వరలోనే మంజూరు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కోరినందున ఆదోనికి ఆటోనగర్‌, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.