డబ్బులు కొట్టేయడానికి సీఎం జగన్‌ గండికోటకు సొరంగం తవ్వుతారని చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పట్టిసీమను ఎగతాళి చేసిన వ్యక్తి జగన్‌ అని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బుధవారం (ఆగస్టు 2) చంద్రబాబు గండికోట రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం పులివెందులలో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. పట్టణంలోని పులివెందుల పూలఅంగళ్ల కూడలిలో చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పూలఅంగళ్ల ప్రాంతం జనంతో నిండిపోయింది.


పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు బాగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ‘‘ఈ ముఖ్యమంత్రి కోసం మీరు విశాఖపట్నం వెళ్లాలా? అమరావతి అయితే నాలుగు గంటల్లో వెళ్లి వచ్చేయొచ్చు. పోలవారాన్ని కూడా నాశనం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. 72 శాతం పూర్తిచేశా. నాకు తెలుసు ఆ బాధ. ఈ ముఖ్యమంత్రి వచ్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి అన్ని మార్చేశాడు. మూడేళ్లలో వర్షాలు తీవ్రంగా వచ్చి డయాఫ్రంవాల్, కాపర్ డ్యాం కూడా కొట్టుకుపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఈ దుర్మార్గుడు గోదాట్లో కలిపేశాడు. నేను వదిలిపెట్టను, నేను పట్టుకుంటే ఉడుం పట్టే. మళ్లీ పోలవరం కడతా. ఆ నీళ్లు బనకచర్లలో పోసి సస్యశ్యామలం చేస్తా. 


ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా మాట్లాడుతున్నాడు. నీటి పారుదల ప్రాజెక్టులపై నేను వేసిన ప్రశ్నలపై మాట్లాడకుండా.. పవన్ కల్యాణ్ బ్రో సినిమాపై ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు మంత్రివా? లేదంటే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్ వా అని అడుగుతున్నా? హుందాతనం లేదు. పద్ధతి లేదు. మీరు ఒక సైకోని ఇచ్చారు. ఆయన సైకోల్ని తయారు చేస్తున్నాడు’’ అని చంద్రబాబు అన్నారు.


వాలంటీర్లపైనా విమర్శలు


‘‘వాలంటీర్లను ప్రజల నెత్తిన పెట్టాడు. వాళ్లతో తప్పుడు పనులు చేపిస్తున్నాడు. భార్యాభర్త సక్రమంగా కాపురం చేస్తున్నారా అనేది వాలంటీర్లతో పరిశీలిస్తున్నాడు. వాళ్ల ఆస్తులు, పెళ్లిళ్లు, విడాకుల సమాచారం సేకరిస్తున్నారు. టీడీపీ వారి ఓట్లు తీసేస్తున్నారు. వాలంటీర్లు నిజంగా ఉపయోగపడితే నేను తీయను. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే నేను ఉపేక్షించను. మీ ఓటు ఉంటేనే మీరు మళ్లీ గెలిపించుకోవచ్చు.


వై నాట్ పులివెందుల


మొన్న జగన్ కుప్పానికి వెళ్లి గెలిపించమని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను పులివెందులలో అడుగుతున్నా.. వై నాట్ పులివెందుల? ఇక్కడ బీటెక్ రవిని మీకు అప్పజెబుతున్నా. బుల్లెట్ లాంటి మనిషి. మీకు అప్పజెబుతున్నా. గెలిపిస్తామని గట్టిగా చెప్పండి. ఈసారి గెలిపిస్తారా? పులివెందుల నుంచి 1984లో డీఎన్ రెడ్డిని ఎంపీగా గెలిపించారు. మిగిలిన సమయాల్లో మీరు గెలిపించలేదు. పులివెందుల నాయకులకు చెప్తున్నా.. ఎవరైనా కర్ర తీసుకొని వస్తే మీరు కూడా కర్ర తీసుకొని వెళ్లండి. బెదిరిస్తే గుండెల్లో నిద్ర పోవాలి. నన్న రెచ్చగొడితే.. నేను ఎప్పుడు కొదమ సింహమే. ఎవరు అండర్ ఎస్టిమేట్ చేసినా కొదమ సింహంగా ముందుకు పోయి అణచివేస్తాను


బనకచర్లకు నీళ్లిస్తా


బనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్లివ్వాలనేది నా జీవిత ఆశయం.. తప్పకుండా చేస్తా. నల్లమలలో 32 కిలో మీటర్ల టన్నెల్‌ ద్వారా బనకచర్లకు నీళ్లు తీసుకొస్తాం. బనక చర్ల నుంచి రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయి. రాయలసీమను రత్నాల సీమ అవుతుంది. ఈ ప్రాంతాన్ని హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తాం’’ అని చంద్రబాబు మాట్లాడారు.