మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాక్షులకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సీబీఐ... నిందితుల్లో ఒకరైన గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం న్యాయపోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకరైన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టను ఆశ్రయించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. విచారణ కీలక దశలో ఉన్న టైంలో గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని రిక్వస్ట్ చేసింది. ఈ టైంలో గంగిరెడ్డి బెయిల్‌పై బయట ఉంటే... సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని వాదించింది. సాక్షులను రక్షించుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును వేడుకుంది.
గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం వాదించిన సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారని సంచలన కామెంట్స్ చేసింది. వీళ్లిద్దరు ఒక్కటై దర్యాప్తును ముందుకు జరక్కుండా చూస్తున్నారని ఆరోపించింది. వీటన్నంటినీ పరిగణలోకి తీసుకొని గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు ప్రాధేయ పడింది.
సీబీఐ వాదనలు విన్న సుప్రీంకోర్టు... గంగిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. నెలరోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు 14కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.