Bhuma Akhila Priya: దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరగని ఘటన నంద్యాలలో చోటు చేసుకుందని భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) అన్నారు. ఒక ఆడపిల్ల మీద దాడి చేసి ఆ ఆడపిల్ల మీదే కేసు పెట్టి స్టేటన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సాంస్కృతి తాను విన లేదని ఎక్కడా చూడలేదని వాపోయారు. రాష్ట్రాల్లో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. తన మీద కేసు పెట్టడమే కాకుండా, కేసు పెట్టించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారో అని అన్నారు. వారి ఇళ్లలో ఆడవారు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానని భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అఖిలప్రియ వచ్చారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో ఆమెకు కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కండిషన్ మేరకు నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్ కు అఖిలప్రియ సంతకం చేసి వెళ్లారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు.


AV Subba Reddy: సుబ్బారెడ్డి, అఖిల ప్రియ పరస్పర కేసులు


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా కొత్తపల్లి వద్ద టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. అఖిల ప్రియ వర్గం తనపై దాడి చేసి హత్యాయత్నం చేసిందని ఆరోపిస్తూ ఏవీ సుబ్బారెడ్డి కేసు పెట్టారు. అఖిల ప్రియ కూడా తన చున్నీ లాగి, బట్టలు చించేశారని కేసు పెట్టారు. ఈ రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యాయత్నం కేసులో అఖిల ప్రియను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మాజీ మంత్రి అఖిల ప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ నంద్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు మే 17న అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్ విధించింది.


బెయిల్ ఇచ్చిన కర్నూలు కోర్టు


రిమాండ్ తర్వాత భూమా అఖిల ప్రియకు కర్నూలు కోర్టు నిన్న (మే 24) బెయిల్ మంజూరు చేసింది. అఖిలప్రియను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.


ఒకప్పుడు కలిసి మెలిసి, ఇప్పుడేమో ఉప్పు నిప్పు


భూమా నాగి రెడ్డికి ఏవీ సుబ్బా రెడ్డికి ఒకప్పుడు మంచి సంబంధాలు ఉండేవి. భూమా మీదకి పోవాలంటే సుబ్బారెడ్డిని దాటిపోవాలి అనేంతలా వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిల ప్రియకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు రాకుండా ఏవీ సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని అఖిల ప్రియ వర్గం ఆరోపణ. కొన్ని ఆస్తుల వివరాలు కూడా తనకు చెప్పకుండా దాచి పెట్టారని అఖిల ప్రియ అనుకుంటున్నారు. అలా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఒకప్పుడు కలిసి మెలిసి ఉన్న వారు.. ఇప్పుడు ఉప్పు నిప్పులా తయారయ్యారు.