Sharmila Comments on AP CM YS Jagan- కర్నూల్: తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి అప్పు ఇవ్వడం ఏంటని ఏపీలో హాట్ టాపిక్ అయింది. దీనిపై కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల మాట్లాడుతూ.. జగన్ నాకు అప్పు ఇచ్చారు.. ఆ విషయం నేను అఫిడవిట్ లో చేర్చానని క్లారిటీ ఇచ్చారు.


ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉంది 
కర్నూల్ జిల్లాలో AP న్యాయ యాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘సమాజంలో చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు.. ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉంది. మేనమామగా కూడా బాధ్యత ఉంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి. ఇది సహజంగా అందరూ పాటిస్తారు. కానీ కొందరు వ్యక్తులు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఒక్క కొసరు చెల్లెళ్ళకు ఇచ్చి అదికూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారు. ఈ విషయం కుటుంబానికి, దేవుడికి తెలుసు ’ అని ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం, అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై  సంచలన వ్యాఖ్యలు చేశారు.


‘వివేకా పర్సనల్ లైఫ్ ను తప్పుగా చూపిస్తున్నారని, ఇది దారుణమన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న నాయకుడు వివేకా. ఆయన సేవలు మీరు వాడుకున్నారు. అప్పుడు లేని పర్శనల్ లైఫ్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని వైసీపీ నేతల్ని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారం కోసం వివేకా హత్య ను వాడుతున్నాం అనేది కరెక్ట్ కాదు’ అన్నారు.


న్యాయం జరిగింటే రోడ్ల మీదకి వచ్చేవాళ్లం కాదు 
నిందితులకు శిక్ష పడితే ఎవరూ రోడ్ల మీదకు వచ్చే వాళ్ళం కాదు. సోదరి సునీత రోడ్ల మీదకు వచ్చి న్యాయం కోసం కొంగుచాపేది కాదు. చిన్నాన్న వివేకా హత్య కేసు నిందితులు, హత్య చేయించిన వాళ్ళు ఒకే దగ్గర ఉన్నారు అని సీబీఐ స్పష్టంగా చెప్పింది. గూగుల్ మ్యాప్స్ అన్ని అవినాష్ రెడ్డి ఇంట్లోనే చూపుతున్నాయి. ఫోన్ కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి. హత్యకు సంబంధించి డబ్బు లావాదేవీలు జరిగాయి. అన్ని ఆధారాలు CBI దగ్గర ఉన్నాయి. సీబీఐ చెప్తేనే నాకు హత్య ఎవరు చేశారు అనే విషయం తెలిసింది. అవినాష్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు చేశారు అని సీబీఐ చెప్పలేదు. హత్య చేయించింది వాళ్ళే కాబట్టి అన్ని ఆధారాలు వాళ్ళే అని చెప్తున్నాయి. చిన్నాన్న వివేకా హత్యతో సునీత కుమిలిపోతోంది. ఇది ఆస్తుల కోసం కాదు.. పదవుల కోసం చేస్తున్న పోరాటం కాదు - వైఎస్ షర్మిల


బాబాయ్ వివేకాను గొడ్డలితో దారుణంగా నరికి చంపి, హత్యను మభ్య పెట్టాలి అని చూస్తున్నారని తెగించి న్యాయం కోసం నిలబడ్డాం అన్నారు. రేపు మాకైనా, మా పిల్లలకు అయినా ఏమవుతుందో తెలియదు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం మొండిగా పోరాటం చేస్తున్నాం, నాకు చంద్రబాబు తో అవసరం లేదన్నారు. నేను వైఎస్ఆర్ బిడ్డను, వేరొకరి స్పీచ్ పట్టుకొని చదవాల్సిన అవసరం లేదన్నారు. 


షర్మిల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలివే.. 
గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయని వైఎస్ షర్మిల తొలిసారి కడప ఎంపీగా బరిలోకి దిగారు. దాంతో షర్మిల ఎన్నికల అఫిడవిట్ లో ఆమె తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ వద్ద నుంచి షర్మిల రూ.  82,58,15,000 (రూ.82 కోట్ల 58 లక్షల 15 వేలు) అప్పుగా తీసుకున్నారు. వదిన భారతి రెడ్డి వద్ద రూ.19,56,682 (రూ.19 లక్షల 56 వేల 6 వందల 82) అప్పుగా తీసుకున్నానని అఫిడవిట్ లో షర్మిల పేర్కొన్నారు. షర్మిల మొత్తం ఆస్తుల విలువ రూ.182.82 కోట్లు కాగా, భర్త అనిల్ కుమార్ ఆదాయం రూ. 3,00,261 మాత్రమేనని తెలిపారు.