రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదని అన్నారు సీఎం జగన్. అందుకే రైతులకు మంచి చేసే రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి మంచి కార్యక్రమం చేయబోతున్నామని వివరించారు. 3,900 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తున్నామని ప్రకటించారు.
ఎన్నికల వేల మేనిఫెస్టులో చెప్పిన దాని కంటే మిన్నగా... 12500 ఇస్తామని చెప్పాం కానీ... అధికారంలోకి వచ్చాక 13500 ఇస్తున్నామన్నారు. నాలుగేళ్ల ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. కానీ ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రతి రైతు 54వేల రూపాయలు అందుకున్నారు. ఈ దఫా ఇచ్చే ఈ 7500 కలుపుకుంటే ప్రతి రైతు చేతిలో 61500 నేరుగా జమ చేసినట్టు అవుతుంది. రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సాయాన్ని ఈ దఫా 52లక్షల3 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం.
కేంద్రం ఇచ్చేందుకు ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రభుత్వం ముందే ఇస్తోంది. రైతు భరోసా కింద నేరుగా రైతుల ఖాతాల్లోకి 31000 కోట్ల రూపాయలను జమ చేసింది.
ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోపు ఇస్తున్నాం. ఈసారి కూడా అదే పద్దతిలో ఎక్కడా ఆలస్యం లేకుండా మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన 51 వేల మంది రైతుల ఖాతాల్లోకి 54 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. 22లక్షల 75 వేల మంది రైతులకు 19,65 కోట్ల రూపాయలు జమ చేశాం.
నాలుగేళ్లలోనే వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రైతులకు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప మార్పు. గత ప్రభుత్వంలో చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనైనా తట్టిందా అని ప్రశ్నిస్తున్నాను. అప్పట్లో ఆ ఊసే లేదు. గ్రామ స్థాయిలోనే విత్తనం అమ్మకం నుంచి పంట కొనుగోలు వరకు తోడుగా ఉంటున్నాం. 10వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.
వీటి ఫలితంగా దిగుబడి పెరిగింది. అప్పట్లో సగటున 153 లక్షల టన్నులు ఉంటే... ఇప్పుడు సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి చూస్తే 228 లక్షల టన్నులు ఉంటే... ఇప్పుడు 332 లక్షల టన్నులకు పెరిగింది. ఏ సంవత్సరం చూసిన చంద్రబాబు హయాంలో కరువు ఉండేది. అప్పట్లో 1623 కరవు మండలాలు ప్రకటించారు. ఇప్పుడు మంచి వానలు పడుతున్నాయి. కరవులు లేవు. వలసలు కూడా తగ్గాయి. నాలుగేళ్లలో ఒక్క కరవు మండలం కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు హయాంలో సన్నా వడ్డీ రుణాలపై నలభై లక్షల అరవై వేల మంది రైతులకు 685 కోట్లు అందిస్తే... నాలుగేళ్లలో 1835 కోట్లు అందించాం. 74 లక్షల మంది రైతులకు మంచి చేశాం. గతంలో 30లక్షల 85 వేల మంది రైతులకు 3411 కోట్లు రూపాయలు పంటల బీమా కింద ఇస్తే... ఈ నాలుగేళ్లలోనే 44 లక్షల మంది రైతులకు 6685 కోట్ల రూపాయలు ఇచ్చాం. గతేడాది ఖరీప్ బీమా సొమ్మును జులై 8న రైతు ఖాతాల్లో జమ చేస్తాం.
భూమిపై సర్వ హక్కులు రైతుకు చాలా అవసరం. గత వందేళ్ల క్రితం భూ సర్వే జరిగింది. ఫలితంగా వివాదాలు పరిష్కారం కాలేదు. అందుకే సమగ్ర భూసర్వే చేపట్టి రికార్డులు అప్‌డేట్ చేసి వివాదాలకు తావు లేకుండా రైతుల చేతిలో భూహక్కుల పత్రాలు పెడుతున్నాం. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు జరగాలని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.