Kurnool News :   ఇల్లు కట్టుకోవడానికి పునాది తవ్వుతున్నారు. హఠాత్తుగా పునాదులు తవ్వేదగ్గర ఓ ఇనప్పెట్టె బయటపడింది. అది కాస్త పురాతనంగా ఉంది. ఇంకేం పంట పండింది అని చాలా మంది అనుకుంటారు. అయితే అసలు  ఇనప్పెట్టే నాదేనని వెంటనే ఎవరైనా వస్తే.. అసలు డ్రామా స్టార్టవుతుంది. అక్కడ ఓ సినిమాకు కావాల్సినంత కథ జరుగుతుంది. చివరికి క్లైమాక్స్‌లో ఊహించనిది జరుగుతుంది. ఇలాంటి కథ  కర్నూలులో మంగళవారం జరిగింది. 
 
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామం స్థానికంగా నివాసం ఉండే నర్సింహులు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పురాతన భవంతి గోడలను జేసీబీలతో పగుల గొడుతుండగా భారీ ఇనుప పెట్టె బయటపడింది. అచ్చం నేటి లాకర్‌లను పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీషులో మద్రాసు అని రాసివుంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. ఈ ఇనుప పెట్టె ఇంచుకూడా కదపలేనంత బరువుంది. దీంతో ట్రాక్టర్‌లో తీసుకొచ్చి తెరిచేందుకు విఫలయత్నం చేశారు గ్రామస్తులు. బ్యాంకు లాకర్‌ల కన్నా బలంగా ఉన్న ఈ పెట్టెకు రెండు తాళాలున్నాయి.                 

  


ఇది పురాతన కాలానిది కావడంతో ఇందులో భారీగా బంగారం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. చుట్టు పక్కల వాళ్లంతా కలిసినా దీన్ని మొయ్యలేకపోయారు. జేసీబీతో దీన్ని బయటకు తెచ్చారు. ఆ నోటా ఈ నోటా పడి.. విషయం  పోలీసులకు  రెవెన్యూ అధికారులకు తెలిసింది. స్థానిక ఆర్డిఓ దీన్ని పరిశీలించి, ఓపెన్‌ చేసి అందులో ఏముందనేది తేల్చాలనుకున్నారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ పెట్టే తనదేనని.. తన కివ్వాలని ఆ గ్రామంలోని వ్యక్తే వాదులాటకు దిగాడు. అతను ఎవరంటే.. నర్సింహులకు స్థలం అమ్మిన  వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర పాత ఇంటిని కొనుగోలు చేసిన నర్సింహులు కొత్త ఇంటిని నిర్మించడానికి కూలగొడుతున్న సమయంలోనే  ఈ ఇనప్పెట్టే బయటపడింది.                            


ఇప్పుడు నర్సింహులు.. ఆ స్థలం పాత యజమాని మధ్య  జరగాల్సినంత  రచ్చ జరిగింది. ముందు అది అసలు ఎవరిదో తేల్చకుండా ఆ బీరువాను ఓపెన్ చేస్తే అందులో ఉన్న సొమ్మంతా ఎవరు తీసుకుంటారన్న సందేహం వస్తుంది. అందుకే చాలా సేపు ఆ బీరువాను తెరువలేకపోయారు. చివరికి అధికారులు రాజీ చేసి.. అందులో పురాతన సంపద ఉంటే ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టం చేశారు. అందరికీ రూల్స్ గురించి చెప్పి.. పెట్టేనే అతి కష్టం మీద పగులగొట్టారు. అయితే అందులో వజ్ర వైఢూర్యాలు ఉంటాయని అనుకున్నారు కానీ.. ఆ పెట్టే నిండా మట్టే ఉంది. అందుకే అంత  బరువు ఉంది. అసలు ఇనుప పెట్టేలో ఏమీ లేకపోవడంతో...చివరికి ఆ పెట్టే తమదంటే తమదని పొట్లాడుకున్న వారు కూడా  వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత ఎవరి దారిన వారు గ్రామస్తులు కూడా వెళ్లిపోయారు.  పెట్టే మాత్రం అలా అనాథగా అక్కడే ఉండిపోయింది.