Ysrcp Bus Yatra : ఏపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఇవాళ్టితో ముగిసింది. అయితే వైసీపీ బస్సు యాత్రకు మిశ్రమస్పందన లభించింది. పలుచోట్ల కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాగా పలు చోట్ల ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పలు సభలు జనాలు లేక వెలవెలబోయాయి. కర్నూలులోని ఆదివారం నిర్వహించిన సభకు ప్రజలు హాజరుకాకపోవడంతో మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకే డ్వాక్రా మహిళలను సభకు తరలించారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక మహిళలు వెళ్లిపోయారు. మంత్రులు దాదాపు ఒంటిగంటకు కర్నూలు చేరుకున్నారు. అప్పటికే జనాలు వెళ్లిపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వెళ్లిపోతున్న వారిని కర్నూలు మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కూర్చీల్లో కుర్చోవాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో మంత్రులు సభను కొద్ది సేపు నిర్వహించి వెళ్లిపోయారు. 


అనంతపురంలో భారీ స్పందన 


అనంతరం బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ స్పందన లభించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలన్నీ ఆ పార్టీ కార్యకర్తలకే అందాయన్నారు. వైఎస్‌ జగన్ పాలనలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారన్నారు. టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు సీఎం జగన్‌ను క్విట్ చేయాలా అన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత పథకాలు ఇస్తున్నందుకా అని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. జగనన్న ముద్దు చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్తా్మన్నారు.


సీఎం జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం 


ఈ సభలో మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్‌ పాలన ఉందన్నారు. సీఎం జగన్‌ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సీఎం జగన్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోందని బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం ఏపీలో జరుగుతోందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ అన్న కృష్ణయ్య చంద్రబాబు మాటల్లోనే బీసీలపై ప్రేమ చూపించారని విమర్శించారు. ఇతర  రాష్ట్రాలకు సీఎం జగన్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్.కృష్ణయ్య అన్నారు.