Mobiles Recovery :  కర్నూలు పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. కర్నూలు నగరంతో పాటు వివిధ ప్రదేశాలలో సెల్ఫోన్ పోగొట్టుకున్న, దొంగలు దోచుకెళ్లిన మొబైల్ ఫోన్లను దొంగల నుంచి రికవరీ చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా  మొబైల్ రికవరీ మేళాను కర్నూలులో నిర్వహించామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.  దొంగతనాలకు గురైన 564 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. వాటిని బాధితులకు అందజేశారు.  కర్నూలు పోలీసులు వినూత్నంగా మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. గతంలో మిస్ అయిన మొబైల్ ఫోన్లు, దొంగలు దోచుకెళ్లిన ఫోన్లను రికవరీ చేసి ప్రజలకు తిరిగి అందించిందుకు కర్నూలు పోలీసులు ప్రశంసలు పొందుతున్నారు. 






మీ మొబైల్ మిస్సైందా?  


మొబైల్ ఫోను మిస్ అయితే ముందుగా పోలీస్ శాఖ అధికార వెబ్ సైట్ http://kurnoolpolice.in/mobiletheft లింకును క్లిక్ చేసి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్  వివరాలు నమోదు చేసుకోవాలి. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తారు.


రాష్ట్రంలోనే మొదటిసారి  


రాష్ట్రంలోనే మొదటిసారి కర్నూలు జిల్లా పోలీసులు అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందించారు. ముందు రోజే ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం ఇచ్చారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు. మొబైల్ ఫోన్ లతో పాటు  ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.  జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి  564 ఫోన్లు రికవరీ చేశామని స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మొబైల్ రికవరీ మేళా నిర్వహించామన్నారు. నేరాల నివారణకు పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.  ప్రతి నెల మొబైల్ రికవరీ మేళా నిర్వహిస్తామన్నారు. ప్రజల్లో  అవగాహన పెంచేందుకు మొబైల్ ఫోన్ పోతే మీ సేవాకు వెళ్లి ఎలా అఫ్లై చేయాలో, లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ గోడ పత్రికను ప్రతి గ్రామా సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.  


సెల్ ఫోన్ చోరీకి గురైతే ఇలా చేయండి 


మొబైల్ ఫోన్ పోతే మీ సేవాకు వెళ్లి ఎలా అఫ్లై చేయాలి అనే అంశాలను ప్రజలకు తెలిసేలా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. 


1) మీ - సేవా ఎలా అప్లై చేయాలి


మీ మొబైల్ ఫోన్ పోయిందా? అయితే బాధితులు తమకు దగ్గర్లోని  మీ సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు అందించాలి.  ఫోన్ పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ, ఫోన్ వివరాలు , మీరు పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్ IMEI వివరాలు, పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన  మొబైలు నెంబర్ వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్ , చిరునామా  అందించాలి. మిమ్మల్ని సంప్రదించడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్, ఆల్టర్నేటిన్ కాంటాక్ట్ వివరాలు అందించాలి.  ఈ వివరాలు మీ-సేవాలో సమర్పించి Missing /lost articles  రుసుమును చెల్లించి మీ-సేవా రసీదును తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి.
 
2) వెబ్ సైట్ ద్వారా 


మీరు పోగొట్టుకున్న సెల్ ఫోన్ వివరాలను  http://kurnoolpolice.in/mobiletheft లో నమోదు చేసుకోవాలి.  ఈ లింక్ పై క్లిక్ చేసి  మొబైల్  LOST కాలమ్ లో  మీ పేరు, జిల్లా , పోలీస్ స్టేషన్ పరిధి, మొబైలుకు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు, ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్ మిట్ చేయాలి. ఇలా ఫిర్యాదు చేస్తే పోలీసులు మీ మొబైల్ ను మీకు తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.