Kurnool News : కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మానవత్వం మంటగలిసింది. తొమ్మిది నెలలూ మోసి కాన్పు కోసం హాస్పిటల్ కి వచ్చి పుట్టింది ఆడ బిడ్డ అని తెలిసిన వెంటనే బిడ్డను హాస్పిటల్లో వదిలేసి మాయమయ్యారు. ఈ సంఘటన డోన్ పట్టణంలో యశోద ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది వివరాల తీసుకునేందుకు ప్రయత్నం చేయగా వారి కళ్లుగప్పి బిడ్డను వదిలేసి వెళ్లారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యం స్థానిక డోన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పుట్టిన బిడ్డకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి బిడ్డ క్షేమంగా ఉండడంతో చిన్నారిని కర్నూలుకు తరలించారు.
టిఫిన్ చేసి వస్తామని చెప్పి వెళ్లి
"మార్చి 30వ తేదీ మహిళ పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారు. ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఉదయం 5.30 ఆ సమయంలో డెలివరీ అయింది. ఆమె, తల్లిదండ్రులు టిఫిన్ చేసి వస్తామని చెప్పి వెళ్లారు. కానీ ఎవరూ తిరిగి రాలేదు. ఆడ బిడ్డను ఆసుపత్రిలోనే ఉంచాం. ఐసీడీఎస్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించాం. ఎవరైనా తిరిగి వస్తారేమో అని ఇన్ని రోజులు వేచి చూశాం ఎవరూ తిరిగి రాలేదు. ఆడ బిడ్డ ఆరోగ్యంగా ఉంది. శిశువుకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు ఇచ్చాం" అని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
10 రోజులు వేచిచూశాం
"మార్చి 30న మహిళకు డెలివరీ అయింది. ఆడబిడ్డను తల్లి వదిలిపెట్టివెళ్లిపోయింది. ఆమెను ఆసుపత్రి సిబ్బంది గుర్తించే ముందే అక్కడి నుంచి పరారయ్యారు. ఆసుపత్రి సిబ్బంది ఆడ బిడ్డను వదిలివెళ్లిన విషయాన్ని సీడీపీవో గారికి తెలిపారు. బేబీ కేరింగ్ కోసం పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాం. ఎవరైన తిరిగి వస్తారేమో అని ఎదురుచేశాం ఈ రోజు వరకూ. కానీ ఎవరు రాకపోవడంతో పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిశువు కర్నూలు సీఎస్ డబ్ల్యూ కు పంపిస్తున్నాం. అక్కడి నుంచి శిశు గ్రాహక్ బిడ్డ పంపిస్తాం. ఈ బిడ్డ మా బిడ్డే అని ఎవరైన వస్తే వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు తెలుసుకుని, డీఎన్ఏ టెస్ట్ చేసి వారి బిడ్డే అని నిర్థారణ అయితే వారికి అప్పగిస్తాం. నెల రోజుల్లో ఎవరూ రాకపోతే బిడ్డకు నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ తీసుకుని ఆడాప్షన్ కు పంపిస్తాం" అని ఐసీడీఎస్ అధికారిణి పద్మావతి తెలిపారు.