Chandrababu :వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో నిన్న జరిగిన కుప్పం ఘటన ఉదాహరణ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు... కుప్పం మోడల్ కాలనీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గంలో 33 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్నానన్నారు.  కుప్పం చరిత్రలోనే నిన్న చీకటి రోజు అన్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పేద ప్రజలకు ఇల్లు కట్టించాలని మోడల్ కాలనీ నిర్మించామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మోడల్ కాలనీలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కుప్పంలోని పేద ప్రజలకు అన్యాయం చేస్తూ, ప్రజలను‌ భయభ్రాంతులకు గురిచేస్తుంది వైసీపీ‌ ప్రభుత్వమని చంద్రబాబు ఆరోపించారు. 


అధికార పార్టీకి తొత్తులుగా! 


"టీడీపీ హయాంలో కుప్పం అభివృద్ధికి రూ.1350 కోట్లు ఇచ్చిన జీవోని వైసీపీ వచ్చాకా రద్దు చేసింది.  సివిల్ డ్రస్ లో పోలీసులు కర్రలతో టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తారా‌?  నా దగ్గర సాక్షాలన్ని ఉన్నాయి. ఖబర్దార్ వేటు పడుతుంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు గుండాలుగా మారి టీడీపీ కార్యకర్తలను కర్రలతో కొట్టారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా నడుచుకోకండి. వృత్తి ధర్మాన్ని పాటించండి. నిత్యవసర ధరలపై బాదుడే బాదుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిత్యవసర ధరలు పెరిగిపోయాయి.  చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, చెత్తను తీసుకెళ్లి జగన్ మీద వేస్తే కానీ బుద్ధి రాదు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వాళ్ల అన్న జగన్.  నేను అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే రెట్టింపు చేస్తా. జగన్ పరిపాలన రౌడీయిజం, గుండాయిజానికి మారు పేరుగా మారింది. ప్రజలను భయపెడితే ఊరుకునేది లేదు. టీడీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుంది." - చంద్రబాబు, టీడీపీ అధినేత 


పోలీసుల సమక్షంలోనే దాడులు 


ఏపీలో వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిన్న జరిగిన కుప్పం ఘటన తానెప్పుడూ చూడలేదన్నారు.  వైసీపీ కార్యకర్తల ప్రతాపాలు తన దగ్గర కాదని, జగన్‌ దగ్గర చూపించుకోవాలన్నారు. పులివెందులకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసుల సమక్షంలోనే అన్న క్యాంటీన్‌పై దాడి జరిగిందన్నారు. పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టించారని, అందుకు డీజీపీ కారణమన్నారు.  సీఎం జగన్‌రెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలని, రాష్ట్రంలో బ్రిటీష్ పాలన సాగనివ్వనని చంద్రబాబు హెచ్చరించారు.  ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, మద్యాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని ఆరోపించారు. వైసీపీ ఆరిపోయే దీపమన్నారు.   


డీజీపీ సమాధానం చెప్పాలి 


ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద వందల మంది పోలీసులను పెట్టారన్న చంద్రబాబు.. అన్న క్యాంటీన్‌ దగ్గర ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసులు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేదవాడికి అండగా ఉంటానని వారిపై దాడులు చేస్తున్నారన్నారు. తాను సీఎంగా ఉన్న 14 ఏళ్లు పోలీసులను ఇలాగే వినియోగించి ఉంటే జగన్ బయట తిరిగేవారా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు గడపగడపకు అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. నిన్న ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి జరిగిందని ఆరోపించారు. కుప్పం పరిణామాలకు డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


Also Read : పిచ్చాసుపత్రిలో చేరే రోజు దగ్గర్లోనే! అమిత్ షా-జూ. ఎన్టీఆర్ భేటీపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు