జాతీయ నేతలు ఒక్కొక్కరుగా చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తున్నారు. తాజాగా కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి విమర్శించారు. ఈ మేరకు ఆయన నారా లోకేష్ కు ఫోన్ చేసి ఫోన్ లో పరామర్శించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసులో అరెస్టు చేశారని అన్నారు. న్యాయం జరుగుతుందని లోకేష్ కి ధైర్యం చెప్పారు. చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. 


అఖిలేశ్ యాదవ్ కూడా..
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకూ అందరూ ఇలా చేయడం ట్రెండ్‌గా మారిందని ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానం అని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ విషయంలో అఖిలేష్ యాదవ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఫోన్ చేశారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన ఇండియా కూటమిలోని తొలి నేత అఖిలేష్ యాదవ్ కావడం విశేషం. 


చంద్రబాబు అరెస్ట్‌పై విచారం వ్యక్తం చేశారు. బీజేపీ, వారి అవకాశవాద స్నేహితులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో తాను మాట్లాడతానని అఖిలేష్ యాదవ్ యనమల రామకృష్ణుడుకు తెలిపారు.