Collector Dance: కలెక్టర్ అయితే డాన్స్ చేయకూడదా - అదీ కూడా తప్పేనా ? ఏ రోజుల్లో ఉన్నాం ?
Krishna District Collector: ఎట్ హోం కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డాన్స్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. డాన్స్ చేయడాన్ని కొంత మంది తప్పు పడుతున్నారు. తప్పేం ఉందని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
Krishna Collector Couple Dance: "మడిషన్నాక కూసింత కళాపోసణ ఉండాలయ్యా" అంటాడు ఓ సినిమాలో రావుగోపాలరావు. ఈ డైలాగ్ గురించి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులకు తెలుసో లేదో తెలియదు కానీ వాళ్లకు మంచి కాళా పోషణ ఉంది. అందుకే .. రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో సాయంత్రం ఇచ్చిన విందులో సరదాగా డాన్స్ చేశారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు 'AT HOME' పేరిట తేనీటి విందు ఇచ్చారు. ఇది సంప్రదాయంగా ఇచ్చేదే. ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు డాన్స్ వేశారు. ఉత్సాహంగా వారు వేసిన డాన్స్ చూసి అధికారులు చప్పట్లు కొట్టి అభినందించారు.
అయితే ఈ వీడియోను ఆ ఎట్ హోంలో పాల్గొన్న ఎవరో సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో కలెక్టర్ దంపతులపై కొంత మంది విమర్శలు చేస్తున్నారు. కలెక్టర్ అయి ఉండి డ్యూయట్లకు డాన్సులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ కలెక్టర్ కూడా మనిషేనని వీళ్లు గుర్తించలేకపోతున్నారు. ఎట్ హోం కార్యక్రమం ప్రైవేటు కార్యక్రమం లాంటిదే. అదేమీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వేదిక కాదు. రోడంతా ప్రజా సమస్య.ల పరిష్కారంలో తీరిక లేకుండా ఉంటారు అధికారులు. కొన్నిప్రత్యేక సందర్భాల్లోనే కలుస్తూంటారు. ఈ సందర్భంగా ఇలాంటి కళా ప్రదర్శన చేస్తే.. వారేదో తప్పు చేశారన్నట్లుగా సోషల్ మీడియాలో విమర్శలుచేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు హుషారుగా ఉంటారు. కలెక్టర్ కదా అని తమ కింద అధికారులపై పెత్తనం చేయాలని అనుకోరు. అందరితోనూ సరదాగా ఉండి పనులు చేయించుకుంటారని అంటున్నారు. అదే డాన్సులు సినీ తారలు చేస్తే గొప్పగా విజిల్స్ వేస్తారు. కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు చేస్తే విమర్శలు చేస్తూంటారు. సోషల్ మీడియాలో ఇదో రకమైన జడ్జిమెంట్ రోగం జోరుగా సాగుతోందన్న సైటైర్లు వినిపిస్తున్నాయి.
Also Read: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు