TDP vs Ysrcp fight : కృష్ణ జిల్లా బాపులపాడు మండలం ఆరుగోలను వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో వైసీపీ జెండా పట్టుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. జెండా తీయాలని టీడీపీ కార్యకర్తలు వారించారు. వైసీపీ కార్యకర్త చేతిలో ఉన్న జెండాని టీడీపీ కార్యకర్త లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వైసీపీ కార్యకర్త ఒక్కసారిగా కర్ర పెట్టి టీడీపీ కార్యకర్త తలపై గట్టిగా కొట్టాడు. దీంతో టీడీపీ కార్యకర్త తలకు తీవ్రగాయం అయింది. అటుగా వెళ్తున్న చంద్రబాబు బాధితుడ్ని గమనించి... ముందు ఫస్ట్ ఎయిడ్ కోసం తీసుకువెళ్లమని చెప్పారు. ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు.  


ఎస్పీకి చంద్రబాబు ఫోన్ 


టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ జెండాతో ఆ పార్టీ కార్యకర్త రావడంతో ఘర్షణ జరిగింది. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ జరిగి పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి పరిస్థితిపై మాట్లాడారు. తన పర్యటనలో వైసీపీ కార్యకర్తలు వచ్చి అలజడి సృష్టిస్తున్నారని అయినా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని చంద్రబాబు ఫోన్ లో జిల్లా ఎస్పీని కోరారు. 


ఫ్లెక్సీల వివాదం 
 
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో హనుమాన్ జంక్షన్ వద్ద ప్లెక్సీల కలకలం రేపాయి. గన్నవరం నియోజకవర్గంలో పలు కీలక సమస్యలు, చంద్రబాబుని విమర్శిస్తూ ప్లెక్సీలు పెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. డెల్టా షుగర్ పరిశ్రమ మూసివేత, మల్లవల్లి ఏపీఐఐసీ, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు తీసుకుని అర్హులైన వారికి పరిహారం ఇవ్వలేదని, విజయవాడ ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణంలో ఓ రౌడీ షీటరు హోటల్ కూల్చకుండా రామవరప్పాడు కాల్వగట్లపై పేదల ఇళ్లు కూల్చడం, హుదూద్ బాధితుల సాయం కోసం 50 లక్షలు విరాళంగా సేకరించి లోకేశ్ కు ఇస్తే మాయం చేశారని ఆరోపిస్తు ఫ్లెక్సీలు వేశారు. పోలవరం కాల్వ, బ్రహ్మయ్య లింగం చెరువు అభివృద్ధి అంటూ సామంత మంత్రితో మట్టి దోపిడీ చేశారని, లక్ష ఇళ్లపట్టాలంటూ పేదలకు స్థలాలు ఇవ్వకుండా మోసం చేసినందుకు స్వాగతం పలకాలా అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.  చంద్రబాబు వచ్చే దారిలో పలుచోట్ల ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.  ఇదేమీ ఖర్మ చంద్రబాబు, బైబై బాబూ అంటూ వాటిపై రాశారు.  


నిన్న గుడివాడలో 


కృష్ణా జిల్లా గుడివాడ శరత్ థియేటర్ వద్ద గురువారం టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర ఘర్షణకు దిగాయి.  దీంతో ఇరువర్గాలను పోలీసులు అదుపుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో కారణంగా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల పరస్పరం దాడులకు పడ్డారు. గుడివాడ శరత్ టాకీస్ వద్ద వైసీపీ జెండాలతో పలువురు కార్యకర్తల హల్ చల్ చేశారు. తెలుగుదేశానికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు కారును కొందరు అడ్డుకునేయత్నం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇరు పార్టీలు కార్యకర్తలు ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.