Kovur Assembly constituency: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సంచలన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం నుంచి ఆయనకు జయాలు, పరాజయాలు రెండూ ఉన్నాయి. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడిగా నెల్లూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి మంత్రి, తాను కూడా మంత్రిగా చేశారు. ప్రస్తుతం కాలం కలసిరాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ హయాంలో మినిస్టర్ పోస్ట్ వస్తుందనుకుంటే రెండుసార్లూ ఆయనకు నిరాశే ఎదురైంది. చివరకు చేసేదేం లేక ఈసారయినా అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోకుండా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యర్థి అయ్యారు. దీంతో కాస్త ఆందోళనలో ఉన్న ప్రసన్న.. ఘాటు వ్యాఖ్యలతో రచ్చకెక్కారు.
నెల్లూరులో ప్రత్యర్థులపై బాగా నోరు చేసుకునే నాయకుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఆయనకు చంద్రబాబు అంటే అస్సలు పడదు. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు, చేస్తూనే ఉన్నారు. టీడీపీనేతలందరిపై కూడా ప్రసన్న ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. తాజాగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండో భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని తెరపైకి తెచ్చారు ప్రసన్న. అయితే ఈ విమర్శలు ఆయనకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయి. ప్రసన్న వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది.
ప్రశాంతి రెడ్డికి ప్రచారం..
వీపీఆర్ చాన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ తన వ్యక్తిగత వివరాలను బయటపెట్టలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా తన వివాహం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ప్రశాంతి రెడ్డి మరింత ధైర్యంగా ప్రజల్లోకి వచ్చారు. తన గురించి తాను చెప్పుకున్నారు. తన మొదటి భర్త ఎవరు, తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చిందనే విషయాన్ని బహిర్గతం చేశారు. విమర్శకుల నోళ్లు ఒకేసారి మూయించారు. దీంతో ఆమెకు కోవూరులో మరింత ప్రచారం లభించింది. వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆమె కుంగిపోకుండా ధైర్యంగా ప్రజల ముందుకొచ్చినందుకు ఆమెను అందరూ అభినందిస్తున్నారు.
లోకేష్ అభినందనలు.
ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల అనంతరం ప్రశాంతి రెడ్డి ధైర్యంగా నిలబడ్డారని, నారా లోకేష్ కూడా అభినందించారు. ఆమె వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. లోకేష్ ట్వీట్ తో ప్రశాంతి రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి వైసీపీ ఎమ్మెల్యే నీఛంగా మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రసన్న వ్యాఖ్యల్ని నెల్లూరు టీడీపీ నేతలంతా ముక్త కంఠంతో ఖండించారు. ఇప్పుడు వైసీపీ నుంచే కొందరు ప్రసన్న వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.
ప్రసన్న వ్యాఖ్యలకు మద్దతుగా వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. కనీసం ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా ఆ తర్వాత ఆ వ్యాఖ్యల జోలికే వెళ్లేదు. దీంతో ఒకరకంగా ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు వైసీపీలో ఒంటరిగా మారారు. ప్రత్యర్థి ప్రశాంతి రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రసన్న ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారంతా. అయితే ప్రసన్న వ్యాఖ్యలతో ఆయన అనుకున్నది సాధ్యం కాకపోగా.. ఆయన ప్రత్యర్థి ప్రశాంతి రెడ్డిపై సింపతీ పెరిగింది. ఆమెకు ఊహించని మద్దతు లభించింది.