Kotamreddy :    చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వైసీపీలో మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తోందని ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.  రాజకీయంగా నష్టపోతామని వైసీపీ నేతలే అంటున్నారని... వైసీపీ సానుభూతిపరుడైన ఓ పారిశ్రామికవేత్త ప్రశాంత్ కిషోర్ కు ఫోన్ చేసి చంద్రబాబు అరెస్ట్ పై ఆరా తీశారన్నారు.  వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని..  లోకేష్‍ని అరెస్ట్ చేస్తే వైసీపీకి మరింత నష్టమని ప్రశాంత్ కిషోర్ అన్నారని కోటంరెడ్డి తెలిపారు.  పవన్ కళ్యాణ్‍పై కేసులు పెట్టవద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కోటంరెడ్డి ప్రకటించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 


 చంద్రబాబును అరెస్ట్ చేయడం సరైన పద్దతి కాదని..  బాబును అరెస్ట్ చేయాలనే పనికిమాలిన సలహాలు ప్రశాంత్ కిషోర్ ఇవ్వరని కోటంరెడ్డి స్పష్టం చేశారు.  వైసీపీలో పరిస్థితి బాగోలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అన్నీ చేసినా గెలవలేకపోయిందని గుర్తు చేశారు.  అభివృద్ధి లేదు.. ఉద్యోగాలు లేవు, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.  ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని..   జగన్ ప్రశాంత్ కిషోర్ మాట వినలేదని ఆ పారిశ్రామికవేత్త తనతో చెప్పారన్నారు.  చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని అందరికీ అర్థమవుతోందన్నారు.                                            


చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుండి ఆయన యాక్టివ్ గా ఉన్నారు. నెల్లూరులోని ఇతర టీడీపీ నేతల కన్నా ఎక్కువగా ఆందోళనలు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి ఎంత నష్టం కలిగిస్తుందో వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆయన వైసీపీ నుంచి రావడంతో .. చంద్రబాబు అరెస్టుపై ప్రధానంగా వైసీపీలో ఏమనుకుంటున్నారో విశ్లేషిస్తున్నారు.                             


రెండు రోజుల కిందట  ఆయన  రాష్ట్రంలో చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ  సిద్ధమా? అని  సవాల్ కూడా  చేశారు. మధ్యవర్తులుగా మేధావులను జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మినారాయణ  తీసుకురావచ్చునని, లేదా వైసీపీకి నచ్చిన వారిని తేవచ్చునని అన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సెంటర్లకు మీడియాతో సహా వస్తే అక్కడే లెక్కలు తెలుస్తామన్నారు. ఈ బహిరంగ చర్చకు సాక్షి పేపరు, టీవీ వచ్చినా పర్వాలేదని తమకు అభ్యంతరం లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ 34 పాలిటెక్నీకల్, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, కీయ మోటార్స్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 2019లో దేశంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఏపీకి మెదటి స్థానం వచ్చింది.