Kotamreddy Giridhar Reddy :  వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 24వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలి వరకూ ఆయన వైఎస్ఆర్‌సీపీ సేవాదళ్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మూడు రోజుల కిందట ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చే్సతూ ఉత్తర్వులు జారీ చేశారు.  శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత గిరిధర్‌ను ప్రోత్సహించాలని వైసీపీ అధిష్టానం అనుకుందని ప్రచారం జరిగింది.  అయి తే గిరిధర్ రెడ్డి  సోదరుడితో పాటే ఉండటంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే శ్రీధర్ రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


వైసీపీ సస్పెండ్ చేయకపోవడంతో టీడీపీలో చేరేందుకు శ్రీధర్ రెడ్డి వెనుకడుగు                   


కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన నేరుగా టీడీపీలో చేరే అవకాశం ఉండేది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పార్టీ మారితే అనర్హతా వేటు వేస్తారు. సస్పెండ్ చేస్తే ఆ సమస్య ఉండదు. గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన టీడీపీలో చేరడానికి ఏ సమస్యా ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా గిరిధర్ రెడ్డిని టీడీపీలో చేరుస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ లో చేరిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు ఇదే ఫాలో అయ్యారు. వారి కుటుంబసభ్యులకు వైఎస్ఆర్‌సీపీ కండువా కప్పించారు కానీ.. తాము మాత్రం అధికారికంగా పార్టీలో చేరలేదు. కానీ వారి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  


తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించి వైసీపీకి దూరం జరిగిన కోటంరెడ్డి                                 


సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితునిగా పేరు పొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదన్న కారణంగా అసంతృప్తి కి గురయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన  ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నానని..  మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానని స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. దీంతో ఆయనను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. 


వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున  పోటీ చేస్తానని ఇప్పటికే కోటంరెడ్డి ప్రకటన


వైసీపీకి దూరం జరిగినప్పుడే  2024 ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు. అయితే ఆయన ఇప్పటికీ అధికారికంగా చేరలేదు. ఆ పార్టీ నేతలను కలవలేదు. కానీ నెల్లూరు సమస్యలపై మాత్రం పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా ధర్నాలకు ప్లాన్ చేసుకుంటున్నారు.