Konathala Ramakrishna To Join Janasena Party: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సస్పెన్స్ కి తెరదించారు. కొన్నాళ్లుగా ఆయన జనసేనలో చేరుతున్నారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ని నేరుగా కలిశారు, మంతనాలు సాగించారు కానీ పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. తిరిగి వచ్చిన ఆయన అనకాపల్లిలో తన అభిమానులతో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు కొణతాల. 


అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు కొణతాల. పవన్ కల్యాణ్ ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లబోతున్నారని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే జనసేన పార్టీలో చేర‌తాన‌ని ప్రకటించారు. పార్టీ టికెట్ ఇవ్వాల‌ని కోరాన‌ని, దానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంగీకరించారని కూడా కొణతాల చెప్పారు. పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు కొణతాల. రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయన అని చెప్పారు. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు. 


కాపు సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర నేత కొణతాల రామకృష్ణ. ఆ సామాజిక వర్గంలో కొణతాలకు మంచి పేరుంది. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా కూడా గెలిచారు కొణతాల. వైఎస్ఆర్ హయాంలో ఆయన మంత్రి వర్గంలో కూడా పనిచేశారు. ఉత్తరాంధ్ర సీనియర్ నేతగా అందరి మన్ననలు అందుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కొణతాల. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీకి కూడా రాజీనామా చేసి, మళ్లీ సైలెంట్ గా ఉన్నారు. చివరకు ఇప్పుడు జనసేనలో చేరుతున్నారు కొణతాల. 2024 ఎన్నికల్లో ఆయన జనసేన టికెట్ పై పోటీ చేస్తారని తెలుస్తోంది.


కొణతాల ప్రకటన తర్వాత జనసేన నుంచి కూడా ప్రకటన వెలువడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం మంచి పరిణామం అన్నారు పవన్. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత కలిగిన నాయకుడు కొణతాల అని పవన్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు రామకృష్ణ సేవలు దోహదమవుతాయని చెప్పారు పవన్. జనసేన ప్రకటనపై కొణతాల అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 






ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు జనసేనలో చేరుతుండడంతో ఆ పార్టీ బలపడుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి చేరుతున్న కీలక నేతలంతా టికెట్ పై హామీ తీసుకున్నాకే జనసేనలోకి వస్తున్నారని తెలుస్తోంది. ఇంకా టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం పూర్తి కాలేదు. అయినా కూడా సీట్ల విషయంలో వారి మధ్య క్లారిటీ ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు సీట్ల హామీ ఇస్తూ.. ఆయా స్థానాలను రిజర్వ్ చేసుకుంటున్నాయి పార్టీలు. ఆ తర్వాత వాటిపై అధికారిక ప్రకటన విడుదలయ్య అవకాశముంది.